
‘‘క’ సినిమా 70వ దశకం నేపథ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో సాగుతుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు, పెద్ద వాళ్లను కూడా ఆకర్షించే అంశాలున్నాయి. అందుకే ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన చిత్రం ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
‘క’ ని తెలుగులో నిర్మాత వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ వేఫరర్ ఫిలింస్‌పై రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ–‘‘క’ సినిమా ఫస్ట్ డే షూటింగ్ లొకేషన్‌కు అల్లు అర్జున్‌గారు వచ్చి.. ‘కిరణ్.. ఈ సినిమాతో నువ్వు పెద్ద హిట్ కొట్టాలి’ అని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘ఈ కథను తెరకెక్కించే క్రమంలో మేమంతా ఎలాంటి అనుభూతి పొందామో ప్రేక్షకులు కూడా అదే అనుభూతి చెందుతారు’’ అని సందీప్ అన్నారు.
‘‘1970వ దశకంలో అభినవ్ వాసుదేవ్ అనే ఓ పోస్ట్ మ్యాన్ జీవితంలో జరిగిన కథే ఈ సినిమా’’ అని సుజీత్ చెప్పారు. ‘‘ఈ నెల 30వ తేదీన ‘క’ ప్రీమియర్స్ వేయబోతున్నాం’’ అని వంశీ నందిపాటి తెలిపారు. తన్వీ రామ్, సహ నిర్మాత చింతా రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు.