Know About Waltair Veerayya Villain Bobby Simha - Sakshi
Sakshi News home page

Bobby Simha: మెగాస్టార్‌ను ఒక్కసారైనా చూడాలనుకున్నాడు, ఏకంగా చిరును ఢీకొట్టే విలన్‌గా..

Published Sat, Jan 28 2023 9:43 AM | Last Updated on Sat, Jan 28 2023 10:24 AM

Know About Waltair Veerayya Villain Bobby Simha - Sakshi

సాక్షి, మోపిదేవి (అవనిగడ్డ): వాల్తేరు వీరయ్య సినిమా ఫస్టాఫ్‌లో విలన్‌ క్యారెక్టర్‌ చేసిన బాబీసింహాని అందరూ తమిళ నటుడు అనుకుంటున్నారు కాని ఆయన మనోడే... కృష్ణాజిల్లా దివిసీమలో మోపిదేవి మండలం కోసూరివారిపాలెం వాసి. ఈ సినిమాలో చిరంజీవితో పోటీపడి విలన్‌గా మెప్పించాడు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. విక్రమ్‌ సామి తమిళ అనే చిత్రంలో అద్భుతమైన విలనిజం ప్రదర్శించాడు. హీరో విక్రమ్‌తో పోటీపడి నటించి తమిళ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో సాల్మన్‌సీజర్‌గా చిరంజీవితో పోటీపడి చేసిన నటన బాబీసింహాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

కోసూరువారిపాలెం నుంచి కోయంబత్తూర్‌కు... 
మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెంకు చెందిన లింగం రామకృష్ణ – కృష్ణకుమారి దంపతుల చిన్న కుమారుడే బాబీసింహా. ఆయన తల్లి కృష్ణకుమారి స్వగ్రామం గూడూరు మండల పరిధిలోని తరకటూరు. బాబీసింహా మోపిదేవి ప్రియదర్శిని స్కూల్‌లో 4 నుంచి 8వ తరగతి వరకూ చదివాడు. బాబీసింహా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేందుకు 1996లో తమిళనాడులోని కోయంబత్తూరుకు వలస వెళ్లారు. బాబీసింహా అక్కడే బీసీఏ చదివాడు. అనంతరం సినీరంగంపై ఉన్న మోజుతో కూర్తుపాత్తరాయ్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో మూడు నెలలు నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.   

షార్ట్‌ఫిలింతో గుర్తింపు 
2010లో తొలిసారిగా ది ఏంజల్‌ అనే షార్ట్‌ఫిలింని బాబీసింహా రూపొందించాడు. ఆయన మొత్తం 9 షార్ట్‌ ఫిల్మ్‌ లు తీయగా ‘విచిత్తిరిమ్‌’ అనే షార్ట్‌ఫిలింకు 2012లో  బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ లిటిల్‌షోస్‌ అవార్డు లభించింది. ఈ బుల్లి చిత్రమే ఆయనకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. బాబీసింహా జిగర్తంద చిత్రంలో సహాయనటుడిగా చేసిన నటనకు జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నాడు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో ఇప్పటివరకూ 40 సినిమాల్లో నటించాడు.  

లవ్‌ ఫెయిల్యూర్‌ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి... 
2012లో తమిళ చిత్రసీమలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేసిన బాబీసింహా అదే సంవత్సరం తెలుగులో లవ్‌ఫెయిల్యూర్‌ చిత్రంలో నటించాడు. తరువాత సైజ్‌జీరో, రన్‌ చిత్రాల్లో నటించాడు. తెలుగు వాడైనా తమిళంలోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తమిళంలో 28 చిత్రాల్లో నటించగా కో–2, ఉరుమీన్, తిరుత్తి పైయిలే సినిమాల్లో హీరోగా నటించాడు. ఇరైవి, మెట్రో, మురిప్పిరి మనమ్, పాంబుసలై చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. తమిళంలో ఆయన్ను అభిమానులు సింహా అని ముద్దుగా పిలుచుకుంటారు. మలయాళంలో ఐదు చిత్రాల్లో నటించగా  ‘కుమ్మర సంబరియం’ చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది.

హీరోగా నటిస్తూనే ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించి శభాష్‌ అనిపించుకున్నారు.  2016లో తోటి నటి రేష్మి మీనన్‌ని వివాహం చేసుకున్నాడు. జన్మభూమిపై ఉన్న మమకారంతో 2017లో ఆయన కుటుంబ సమేతంగా వచ్చి మోపిదేవిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో పాపకు పుట్టు వెంట్రుకలు మొక్కు తీర్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు కుమారుడికి మోపిదేవిలోనే పుట్టు వెంట్రుకలు తీయించారు. ఈ సందర్భంగా స్వగ్రామమైన కోసూరువారిపాలెంలో శుక్రవారం స్థానికులు ఎడ్లబండిపై ఆయన్ను ఊరేగించి అభిమానం  చాటుకున్నారు.  

సుబ్బారాయుడి సేవలో సినీ నటుడు బాబీసింహా 


మోపిదేవి(అవనిగడ్డ): స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని బాబీసింహా శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార్‌ శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఏసీ ఎన్‌ఎస్‌ చక్రధరరావు స్వామివారి చిత్రపటం, లడ్డుప్రసాదాలు అందజేశారు.  

చిరంజీవితో నటించడం మర్చిపోలేని అనుభూతి 
చదువుకునే రోజుల్లో చిరంజీవిని దగ్గరగా చూడాలని ఆశ ఉండేది. వాల్తేరు వీరయ్య సినిమాలో ఆయనతో కలిసి నటించడం  మరుపురాని అనుభూతినిచ్చింది. మోపిదేవిలో చదువుకున్న రోజులు ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయి. తమిళ ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ఆదరణ మర్చిపోలేను. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని సినిమాలు చేస్తాను. ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర చేయాలని ఉంది. 
–బాబీసింహా, సినీహీరో

చదవండి: రెండు రోజుల్లోనే రూ.210 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పఠాన్‌
కూతుర్ని హీరోయిన్‌గా చూడాలనుకున్న జమున

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement