
జీవితం ఊహించలేనిది.. ఇలా అన్నది ఎవరో తెలుసా? అది తెలుసుకోవాలంటే ముందుగా యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాలి. ఈయన కోమాలి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టారు. ఆ తరువాత మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తారని అందురూ ఎదురు చూశారు. అలాంటిది హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం లవ్ టుడే. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆ తరువాత ఈయనకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి.
అలా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్. ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఓ మై గాడ్ చిత్రం ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ నెల 21వ తేదీన తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం వైపు పరుగులు తీస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను కలవడం ఆసక్తిగా మారింది. ప్రదీప్ రంగనాథన్ తమిళంలో నటించి, దర్శకత్వం వహించిన లవ్ టుడే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. దీనికి ప్రదీప్ రంగనాథన్ సహ నిర్మాత కావడం గమనార్హం. అందులో అమీర్‌ఖాన్ వారసుడు జునైత్ ఖాన్, శ్రీదేవి వారసురాలు ఖుషీ కపూర్ జంటగా నటించారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదన్నది గమనార్హం.
ఇలాంటి పరిస్థితిలో ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను చెన్నైలో కలవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ డ్రాగన్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఆలోచనతో ఆయన్ని కలిశారా? లేక మరోదైన విషయం కోసం కలిశారా? అన్న చర్చ జరుగుతోంది. అయితే అమీర్‌ఖాన్ ప్రస్తుతం నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.
అదే విధంగా అనారోగ్యానికి గురైన ఆయన తల్లి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను పరామర్శించడానికి ప్రదీప్ రంగనాథన్ వెళ్లారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా అమీర్‌ఖాన్‌తో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసిన ప్రదీప్ రంగనాథన్ అందులో.. జీవితం ఊహించలేనిది అని నేను ఎప్పుడూ చెబుతాను.. మీ అద్భుతమైన మాటలకు ధన్యవాదాలు అమిర్ ఖాన్ సార్.. జీవితాంతం దాన్ని గుర్తుంచుకుంటాను అని పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈయన విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్‌ఐకే చిత్రంలో నటిస్తున్నారు.
Life is unpredictable as i always say :) Thankyou for your wonderful words #aamirkhan sir . Will cherish it for life ❤️ pic.twitter.com/HPjpJLvDN2
— Pradeep Ranganathan (@pradeeponelife) February 23, 2025