ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా తీసే పద్ధతి, చూసే విధానం చాలా మారిపోయింది. కొత్తతరం దర్శకులు ఎలాంటి ప్రయోగాలకైనా వెనకాడటం లేదు. తెలుగులో తక్కువ గానీ తమిళ, మలయాళంలో డిఫరెంట్ కథలు వస్తుంటాయి. అలాంటి ఓ తమిళ మూవీనే 'కొట్టుక్కాళి'. తాజాగా ఇది ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
మీనా (అన్నా బెన్) ఓ సాధారణ అమ్మాయి. ఈమె బావ పేరు పాండి (సూరి). వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అంటే చదువుకుంటానని మీనా చెబుతుంది. దీంతో కాలేజీలో చేర్పిస్తారు. అక్కడే మరో కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఇది మీనా ఇంట్లో తెలిసి ఆమెపై పెద్దోళ్లు కోప్పడతారు. దీంతో పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. ప్రేమించిన అబ్బాయి.. తమ కూతురిపై చేతబడి చేశాడని ఈమె తల్లిదండ్రులు భావిస్తారు. ఈమెకు పట్టిన దెయ్యాన్ని వదిలించాలని కుటుంబమంతా కలిసి ఓ చోటుకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
'కొట్టుక్కాళి' అంటే తమిళంలో మొండి అమ్మాయి అని అర్థం. మలయాళ నటి అన్నా బెన్ లీడ్ రోల్ చేసింది. ఈ సినిమా కథ చాలా సింపుల్. దెయ్యం పట్టిందనుకున్న ఓ అమ్మాయిని తీసుకుని, ఈమె కుటుంబం ఓ స్వామి దగ్గరకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ఒక్కక్కరు ఎలా ప్రవర్తించారు. అసలు దర్శకుడు మనకు ఏం చెప్పాలనుకున్నాడనేదే తెలియాలంటే మూవీ చూడాలి.
సాధారణంగా సినిమా అంటే పాటలు, ఫైట్స్, హోరెత్తిపోయే బీజీఎం.. ఇలా బోలెడంత హంగామా. కానీ 'కొట్టుక్కాళి'లో ఇవేం ఉండవు. ఇంకా చెప్పాలంటే దాదాపు గంటన్నర పాటు ఉండే ఈ మూవీలో హీరోయిన్‌కి ఒక్కటే డైలాగ్. అది కూడా జస్ట్ ఐదే సెకన్లు మాట్లాడుతుంది. అంతే. కోడిపుంజుని తాడుతో బంధించినట్లే.. ఫ్యామిలీ అనే ఎమోషన్స్‌కి తలొగ్గి హీరోయిన్ బంధి అయిపోయి ఉంటుంది. సినిమా చూస్తే ఈ పాయింట్ అర్థమవుతుంది.
అలానే పురుషాధిక్యం, దెయ్యాల్ని వదిలించే పేరుతో కొందరు వ్యక్తులు మహిళల్ని అసభ్యకరంగా తాకుతూ ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయాల్ని ఇందులో చూపించారు. ఈ సినిమాకు క్లైమాక్స్ ఓపెన్ ఎండింగ్‌తో వదిలేశారు. అంటే ఎవరికి ఏమనిపిస్తే అదే క్లైమాక్స్ అనమాట.
ఎవరెలా చేశారు?
ప్రధాన పాత్రలు చేసిన సూరి, అన్నా బెన్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన పాత్రల్లో నటించిన వాళ్లందరూ చాలా నేచురల్‌గా ఉంటారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు పల్లెటూరిలో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. పాండి, మీనా క్యారెక్టర్స్‌తో పాటు అలా ట్రావెల్ అయిపోతాం. దొంగ స్వామిజీల గురించి దర్శకుడు ఏదో మెసేజ్ ఇద్దామనుకున్నాడు. కానీ అందరినీ ఆకట్టుకునేలా తీయలేకపోయాడు.
ఇకపోతే 'కొట్టుక్కాళి' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది. కాస్త ఓపిక ఉండి, డిఫరెంట్ సినిమాలు చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి.
- చందు డొంకాన
Comments
Please login to add a commentAdd a comment