Krishna Gadu Ante Oka Range Movie Review and Rating in Telugu - Sakshi
Sakshi News home page

‘కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్‌’ మూవీ రివ్యూ

Published Thu, Aug 3 2023 6:27 PM | Last Updated on Thu, Aug 3 2023 8:24 PM

Krishna Gadu Ante Oka Range Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్‌
నటీనటులు: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ, ర‌ఘు, స్వాతి పొలిచ‌ర్ల‌, సుజాత‌, విన‌య్ మ‌హ‌దేవ్ త‌దిత‌రులు
నిర్మాణ సంస్థ: శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి
నిర్మాతలు: పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత
దర్శకత్వం: రాజేష్‌ దొండపాటి
సంగీతం: సాబు వర్గీస్
సినిమాటోగ్రఫీ: ఎస్ కె రఫీ 
ఎడిటర్‌: సాయి బాబు తలారి
విడుదల తేది:ఆగస్ట్‌ 4, 2023

కథేంటంటే.. 
కృష్ణ(రిష్వి తిమ్మరాజు) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. తల్లి పెంపకంలో పెరిగి, పెద్దవాడయ్యాక మేనమామ సాయంతో ఊర్లోనే మేకలు కాస్తూ ఉంటాడు. ఎప్పటికైనా తండ్రి ప్రారంభించిన ఇంటిని పూర్తి చేయాలనేది కృష్ణ లక్ష్యం. మరోవైపు అదే ఊర్లో వరుసకు మరదలు అయ్యే సత్య(విస్మయ) కృష్ణని ఇష్టపడుతుంది. కృష్ణకి కూడా సత్య అంటే చాలా ఇష్టం. కానీ సత్య తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని కృష్ణకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడరు.

మరోవైపు అదే గ్రామానికి చెందిన ఓ ధనవంతుడు, కామాంధుడు దేవా చూపు సత్యపై పడుతుంది. సత్య కారణంగా ఓసారి కృష్ణ, దేవా ఊరి జనాల మధ్య కొట్టుకుంటారు. ‘ఉండడానికి ఇల్లు కూడా దిక్కులేదు కానీ ప్రేమ కావాలట’అంటూ కృష్ణని అవమానిస్తాడు దేవ. దీంతో మూడు నెలల్లో ఇంటిని పూర్తి చేసి,సత్యను పెళ్లి చేసుకుంటానని సవాల్‌ చేస్తాడు కృష్ణ. మరి కృష్ణ సొంతింటి కల నెరవేరిందా? తల్లికి క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం అప్పు చేసిన తీసుకొచ్చిన రూ.10 లక్షలు ఎవరు దొంగిలించారు?  చివరకు ఊరి జనాలతో ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌’అని ఎలా అనిపించుకున్నాడు అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
పల్లెటూరి నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథా చిత్రమిది. లవ్‌స్టోరీతో పాటు కామెడీ, యాక్షన్‌ ఇలా అన్ని జానర్లను టచ్‌ చేశాడు దర్శకుడు రాజేష్‌ దొండపాటి. అయితే ఈ తరహా చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ పాతదే అయినప్పటికీ.. కథనాన్ని కాస్త కొత్తగా నడిపించే ప్రయత్నం చేశాడు.

కృష్ణ తండ్రి చనిపోయే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మేకల కాపరిగా హీరోని పరిచయం చేశారు. హీరో ఎంట్రీ సీన్‌ కూడా చాలా సహజంగా ఉంటుంది. సత్యతో ప్రేమలో పడ్డాక కథలో వేగం పుంజుకుంటుంది. కృష్ణ, సత్యల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

అదే సమయంలో కొన్ని సీన్స్‌ సాగదీతగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌ మొత్తం సత్య, కృష్ణల ప్రేమ చుట్టే తిరుగుతుంది. ఓ ఫైట్‌ సీన్‌తో ఇంటర్వెల్‌ కార్డు పడుతుంది. ఇక సెకండాఫ్‌ మొత్తం చాలా ఎమోషనల్‌గా సాగుతూనే వరుస ట్విస్టులు కథపై ఆసక్తిని పెంచుతుంది.  దోపిడీ ముఠాను హీరో కనిపెట్టిన తీరు బాగుంటుంది. క్లైమాక్స్‌లో హీరో  నుంచి మంచి ఎమోషన్స్‌ని రాబట్టుకున్నాడు దర్శకుడు. పేరున్న నటీనటులు లేకపోవడం సినిమాకు మైనస్‌. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమా మొత్తం కృష్ణ, సత్యల పాత్రల చుట్టే తిరుగుతుంది. మేకల కాపరి కృష్ణగా రిష్వి తిమ్మరాజు చక్కగా నటించాడు. తెరపై చూడడానికి పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. అయితే తొలి సినిమా కావడంతో కొన్ని సన్నివేశాల్లో తడబడ్డాడు. సత్యగా విస్మయ తనదైన నటనతో ఆకట్టుకుంది. పల్లెటూరికి చెందిన చలాకీ అమ్మాయిగా ఆమె పాత్ర ఉంటుంది. లుక్స్‌ పరంగా తెరపై కాస్త బొద్దుగా కనిపించినా, అందంగా ఉంది.

దేవా పాత్రపోషించిన నటుడు కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.స్వాతి పొలిచ‌ర్ల‌, సుజాత‌, విన‌య్ మ‌హ‌దేవ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. వినసొంపుగా ఉంటాయి కూడా. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సిన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement