krishna gadu ante oka range Movie
-
‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ మూవీ రివ్యూ
టైటిల్: కృష్ణగాడు అంటే ఒక రేంజ్ నటీనటులు: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ, రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి నిర్మాతలు: పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత దర్శకత్వం: రాజేష్ దొండపాటి సంగీతం: సాబు వర్గీస్ సినిమాటోగ్రఫీ: ఎస్ కె రఫీ ఎడిటర్: సాయి బాబు తలారి విడుదల తేది:ఆగస్ట్ 4, 2023 కథేంటంటే.. కృష్ణ(రిష్వి తిమ్మరాజు) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. తల్లి పెంపకంలో పెరిగి, పెద్దవాడయ్యాక మేనమామ సాయంతో ఊర్లోనే మేకలు కాస్తూ ఉంటాడు. ఎప్పటికైనా తండ్రి ప్రారంభించిన ఇంటిని పూర్తి చేయాలనేది కృష్ణ లక్ష్యం. మరోవైపు అదే ఊర్లో వరుసకు మరదలు అయ్యే సత్య(విస్మయ) కృష్ణని ఇష్టపడుతుంది. కృష్ణకి కూడా సత్య అంటే చాలా ఇష్టం. కానీ సత్య తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని కృష్ణకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడరు. మరోవైపు అదే గ్రామానికి చెందిన ఓ ధనవంతుడు, కామాంధుడు దేవా చూపు సత్యపై పడుతుంది. సత్య కారణంగా ఓసారి కృష్ణ, దేవా ఊరి జనాల మధ్య కొట్టుకుంటారు. ‘ఉండడానికి ఇల్లు కూడా దిక్కులేదు కానీ ప్రేమ కావాలట’అంటూ కృష్ణని అవమానిస్తాడు దేవ. దీంతో మూడు నెలల్లో ఇంటిని పూర్తి చేసి,సత్యను పెళ్లి చేసుకుంటానని సవాల్ చేస్తాడు కృష్ణ. మరి కృష్ణ సొంతింటి కల నెరవేరిందా? తల్లికి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అప్పు చేసిన తీసుకొచ్చిన రూ.10 లక్షలు ఎవరు దొంగిలించారు? చివరకు ఊరి జనాలతో ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’అని ఎలా అనిపించుకున్నాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథా చిత్రమిది. లవ్‌స్టోరీతో పాటు కామెడీ, యాక్షన్ ఇలా అన్ని జానర్లను టచ్ చేశాడు దర్శకుడు రాజేష్ దొండపాటి. అయితే ఈ తరహా చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ పాతదే అయినప్పటికీ.. కథనాన్ని కాస్త కొత్తగా నడిపించే ప్రయత్నం చేశాడు. కృష్ణ తండ్రి చనిపోయే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మేకల కాపరిగా హీరోని పరిచయం చేశారు. హీరో ఎంట్రీ సీన్ కూడా చాలా సహజంగా ఉంటుంది. సత్యతో ప్రేమలో పడ్డాక కథలో వేగం పుంజుకుంటుంది. కృష్ణ, సత్యల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. ఫస్టాఫ్ మొత్తం సత్య, కృష్ణల ప్రేమ చుట్టే తిరుగుతుంది. ఓ ఫైట్ సీన్‌తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం చాలా ఎమోషనల్‌గా సాగుతూనే వరుస ట్విస్టులు కథపై ఆసక్తిని పెంచుతుంది. దోపిడీ ముఠాను హీరో కనిపెట్టిన తీరు బాగుంటుంది. క్లైమాక్స్‌లో హీరో నుంచి మంచి ఎమోషన్స్‌ని రాబట్టుకున్నాడు దర్శకుడు. పేరున్న నటీనటులు లేకపోవడం సినిమాకు మైనస్. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం కృష్ణ, సత్యల పాత్రల చుట్టే తిరుగుతుంది. మేకల కాపరి కృష్ణగా రిష్వి తిమ్మరాజు చక్కగా నటించాడు. తెరపై చూడడానికి పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. అయితే తొలి సినిమా కావడంతో కొన్ని సన్నివేశాల్లో తడబడ్డాడు. సత్యగా విస్మయ తనదైన నటనతో ఆకట్టుకుంది. పల్లెటూరికి చెందిన చలాకీ అమ్మాయిగా ఆమె పాత్ర ఉంటుంది. లుక్స్ పరంగా తెరపై కాస్త బొద్దుగా కనిపించినా, అందంగా ఉంది. దేవా పాత్రపోషించిన నటుడు కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. వినసొంపుగా ఉంటాయి కూడా. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సిన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ హిట్ కావాలి: ఎమ్మెల్యే దాస్యం
‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’మూవీలో మా వరంగల్ వాళ్లకి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. చక్కటి కుటుంబ కథా చిత్రంగా వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని ఎమ్మెల్యే ద్యాసం వినయ్ భాస్కర్ అన్నారు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది చిత్రం బృందం.ఈ ఈవెంట్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, టీఎఫ్‌సీసీ సెక్రటరీ కే ఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, రైటర్ ప్రసన్న కుమార్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా టీఎఫ్‌సీసీ సెక్రటరీ, నిర్మాత కే ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘కంటెంట్ ఉంటే సినిమాలు ఆడుతాయి. కంటెంట్‌ను మాత్రమే కాకుండా కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాలి. అవి రెండూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.ఇలాంటి విలేజ్, లవ్ స్టోరీలకు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగుండాలి. ఈ మూవీకి వారిద్దరూ కూడా సెట్ అయ్యారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’తెలిపారు. ‘ప్రతి మనిషి జీవితంలో కథలుంటాయి. కృష్ణ అనే యువకుడి కథే ఇది. తండ్రి కలను నేరవేర్చటానికి కొడుకు పడ్డ కష్టం. తన ప్రేమ, భావోద్వేగాలను అందంగా చూపించే ప్రయత్నమే మా ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమాను రాజేష్ గారు మలిచారు’అని నిర్మాత పెట్లా రఘురామ్ మూర్తి అన్నారు. ‘కృష్ణ, సత్య పాత్రల్లో రిష్వి, విస్మయ అద్భుతంగా నటించారు’ అని డైరెక్టర్ రాజేష్ దొండపాటి అన్నారు. -
‘కృష్ణగాడు..’ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్: రాజేష్ దొండపాటి
‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్’ అని దర్శకుడు రాజేష్ దొండపాటి అన్నారు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రాజేష్ దొండపాటి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నాకిది తొలి సినిమా. మేకింగ్‌లో చిన్నా చితక ఇబ్బందులు తప్ప ఏమీ ఎదురు కాలేదు. ప్రొడ్యూసర్ రఘురామ్‌గారి సపోర్ట్‌తో సినిమాను అనుకున్న దాని కంటే రెండు రోజుల ముందే పూర్తి చేశాం. చాలా మంచి టీమ్ కుదిరింది. ముఖ్యంగా సాబు వర్గీస్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ ఎసెట్‌గా నిలిచింది. దానికి తగ్గట్లు వరికుప్పల యాదగిరిగారు అద్భుతమైన లిరిక్స్ అందించారు. మూవీలోని పాటలు విన్నవాళ్లందరూ బావున్నాయని అప్రిషియేట్ చేస్తున్నారు. మా చిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుంది’ అన్నారు. -
వాళ్లే నాకు స్పూర్తి.. లాభాలు లేకున్నా సినిమాలు చేస్తా: నిర్మాత
ఉద్యోగరిత్యా సాఫ్ట్ వేర్ అయినా సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆరేళ్ల క్రితం సినిమాల మీద ఓ ఆలోచన వచ్చింది. ఎప్పుడూ సినిమాలు చూడటమేనా? మనం ఎందుకు తీయలేమని నాలో ఆలోచన పుట్టింది. అలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను’ అని అన్నారు నూతన నిర్మాత పెట్లా రఘురామ్ మూర్తి. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు.శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.రాజేష్ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్ట్ 4న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత పెట్లా రఘురామ్ మూర్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే.. ► హైదరాబాద్‌లో మైక్రో సాఫ్ట్‌లో పని చేస్తుండగా.. ఓ స్నేహితుడు కథలు రాస్తుండేవాడు. ఎన్నో సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గానూ పని చేశాడు. అలా సినిమాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆయనతో ద్వారానే సినిమాల్లోకి వచ్చాను.ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ను పరిచయం చేశాడు. అతనే మా సినిమా డైరెక్టర్ రాజేష్ దొండపాటి. ►నిర్మాతగా ఓ కుటుంబంతోకలిసి అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఓ సినిమా తీయాలనుకున్నాను. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు ఇప్పట్లో అంతగా రావడం లేదు. నాకున్న ఆలోచనలే మా దర్శకుడు రాజేష్‌కి ఉండేవి. అలా మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ కథలో కొన్ని ఇన్ పుట్స్ కూడా నేను ఇచ్చాను. ►ఈ చిత్రంలో హీరో గొర్రెల కాపరిగా పని చేస్తాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. అతని తండ్రి కల ఏంటి?.. ఆ కలను నెరవేర్చే ప్రయత్నంలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో సినిమా కథ ఉంటుంది. స్టోరీలో భాగంగా హీరో `కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ `అని చాలా సార్లు చెబుతుంటాడు. అదే మాట ఊరి జనంతో చెప్పించాడా? లేదా అనేదే కథ. ► సినిమాను నిర్మించడం కష్టమని అంటుంటారు. కానీ నాకు అలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. నేను మొత్తం యూఎస్‌లోనే ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ ఇక్కడ మ్యానేజ్ చేసే వాళ్లు. అయితే మాకు అనుభవం లేకపోవడంతో కాస్త బడ్జెట్ అదుపు తప్పింది. ►మొదటి ప్రయత్నంతోనే విజయం వస్తుందో లేదో చెప్పలేం. నేను నిర్మాతగా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. వరుసగా సినిమాలు నిర్మిస్తుంటాను. లాభాలు రాకపోయినా పర్లేదు. రిస్క్ లేకుండా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. ► ఇండస్ట్రీలో దిల్ రాజు, అరవింద్, రామానాయుడు అంత ఎదగాలని అనుకుంటున్నాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి క్రియేటివ్ వ్యక్తుల వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. వారే నాకు స్పూర్తి. ప్రస్తుతం అన్ని రకాలు చిత్రాలు చేయాలని ఉంది. ఎలాంటి డ్రీమ్ ప్రాజెక్టులేవీ లేవు.