
సినిమా ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో తెలియదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటారు. అలా ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌లోకి వచ్చిన నటి కృతిశెట్టి(Krithi Shetty). ఈ కన్నడ భామ వాస్తవానికి 17 ఏళ్ల వయసులోనే నటిగా రంగప్రవేశం చేశారు. అలా తొలుత సూపర్ 30 అనే హిందీ చిత్రంలో నటించారు. తరువాత తెలుగులోకి ఉప్పెన చిత్రంతో దిగుమతి అయ్యారు. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో మరో ధ్రువతార వచ్చిందని అందరూ అనుకున్నారు. అన్నట్లుగానే తెలుగులో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో నటించి వరుసగా విజయాలను అందుకున్నారు.
ఆ తరువాతనే కథ అడ్డం తిరిగింది. తెలుగులో తను నటించిన చిత్రాలు ఫ్లాప్ కావడంతో మలయాళం, కన్నడం, తమిళం భాషలపై దృష్టి సారించారు. అలా మలయాళంలో నటించిన ఏఆర్‌ఎం అనే చిత్రం ఈ బ్యూటీకి మంచి పేరే తెచ్చి పెట్టింది. అయితే ద్విభాషా చిత్రం పేరుతో ది వారియర్, కస్టడీ చిత్రాలతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఎంత ఉప్పెనలా ఎట్రీ ఇచ్చారో ఇప్పుడు అంత చప్పగా ఈమె కెరీర్ సాగుతోంది. కృతిశెట్టికి ప్రస్తుతం మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లో ఒక్క చిత్రం కూడా లేదు. తమిళంలో మాత్రం మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. రవిమోహన్‌కు జంటగా నటించిన జీనీ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. అదేవిధంగా కార్తీకు జంటగా నటించిన వా వాద్ధియార్ చిత్రం నిర్మాణాంతర కార్యమాల్లో ఉంది.
కాగా ప్రదీప్ రంగనాథ్‌తో జత కట్టిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ మూడు చిత్రాలపైనే నటి కృతిశెట్టి కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు. దీంతో ఈ అమ్మడు అవకాశాల వేటలో పడ్డారు. అందుకు అందరు హీరోయిన్ల బాటలోనే గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి దర్శక నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశాల సంగతి ఏమోగానీ, ఇప్పుడు ఆమె గ్లామరస్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.