‘‘మనమే’ మూవీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రతి సన్నివేశంలో వినోదం ఉంటుంది. అలాగే వండర్‌ఫుల్ కిడ్, పేరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. అది గ్లోబల్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మొత్తం మా ముగ్గురి పాత్రల (శర్వా, కృతి, విక్రమాదిత్య) చుట్టూ తిరుగుతుంది.. అందుకే ‘మనమే’ అనే టైటిల్ పెట్టాం’’ అని హీరోయిన్ కృతీ శెట్టి అన్నారు. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమాదిత్య కీలక పాత్ర చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై రామ్‌సే స్టూడియోస్ ప్రోడక్షన్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి పంచుకున్న విశేషాలు...
∙‘మనమే’లో నా పాత్ర పేరు సుభద్ర. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌కి ఇది వైవిధ్యంగా ఉంటుంది. నేను క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ, తొలిసారి ‘మనమే’లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండే పాత్ర చేశాను. నిజ జీవితంలో నాకు పెద్దగా కోపం రాదు.. గట్టిగా అరవను. చాలా కామ్‌గా ఉంటాను. చెప్పాలంటే సుభ్రద్రలా స్ట్రిక్ట్‌గా ఉండలేను. అందుకే
ఈ పాత్ర చేయడం నాకు పూర్తిగా కొత్తగా అనిపించింది. ఈ పాత్ర కోసం డైరెక్టర్ శ్రీరామ్‌గారి విజన్‌ని ఫాలో అయ్యాను.
నా తొలి మూవీ ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్రకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు. ‘ఉప్పెన’ రస్టిక్ లవ్ స్టోరీ. ‘మనమే’ రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నేను చేసిన సుభద్ర పాత్రలో చాలా భావోద్వేగాలున్నాయి. అది ప్రేక్షకులకి నచ్చుతుందనే ఆశిస్తున్నాను. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ మన చేతుల్లో ఉండదు. నా వరకూ పాత్రకి న్యాయం చేస్తాను. మన చేతిలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి, ఆందోళన చెందకూడదని ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను.
ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను. ఆ కమిట్‌మెంట్స్ వల్లే తెలుగులో గ్యాప్ వస్తోంది. పైగా రొటీన్ పాత్రలు కాకుండా వైవిధ్యంగా ఉన్నవి మాత్రమే చేయాలనుకుంటున్నాను. ‘బాహుబలి’ చిత్రంలో అనుష్కగారిలా నాకు మహారాణి పాత్ర చేయడం ఇష్టం. అలాగే యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్ రోల్స్ కూడా చేయాలని ఉంది. నాకు వీలు కుదిరినప్పుడు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటాను.
Comments
Please login to add a commentAdd a comment