
ప్రేక్షకులు ఇప్పుడు చాలావరకు భారీ బడ్జెట్ సినిమాలంటే థియేటర్లకు వెళ్తున్నారు. మిగతా చిన్న చితకా మూవీస్ ని ఓటీటీల్లో చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలా పరభాషా చిత్రాల్ని డబ్ చేసి డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలా కొన్నిరోజుల క్రితం జీ5లోకి వచ్చిన మూవీ 'కుడుంబస్థాన్'. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: భార్యని కూడా రేసులోకి దింపిన చైతూ)
కథేంటి?
నవీన్ (మణికందన్) ఓ యాడ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. వెన్నెల (శాన్వి మేఘన) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. వీళ్లిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. కులాల వేరు కావడంతో పెద్దల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. అయినా సరే నవీన్.. వెన్నెలని ఇంటికి తీసుకెళ్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఓ రోజు నవీన్ ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఈ విషయం ఇంట్లో చెబితే ఇబ్బంది అవుతుందని దాన్ని దాచేందుకు చాలా ఇబ్బందులు పడతాడు. మోసానికి కూడా గురవుతాడు. మరి నవీన్ గురించి ఇంట్లో తెలిసిపోయిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.

ఎలా ఉందంటే?
ఇండస్ట్రీలో కథల కొరత ఉందని చాలామంది అంటూ ఉంటారు. కానీ తరచి చూస్తే మన చుట్టుపక్కలా బోలెడన్ని స్టోరీలు తారసపడతాయి. అలా ఓ మధ్య తరగతి కుర్రాడి జీవితంతో తీసిన సినిమానే 'కుడుంబస్థాన్'.
నవీన్-వెన్నెల లేచిపోయి పెళ్లి చేసుకోవడంతో సినిమా మొదలవుతుంది. భార్యని ఇంట్లోకి తీసుకొస్తే.. తక్కువ కులం అమ్మాయి అని తల్లి సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తుంది. మరోవైపు తీర్థయాత్రల కోసం తల్లి.. కొడుకుని డబ్బులు అడుగుతుంది. తండ్రేమో ఇంటి బాగుచేయమని గోల చేస్తుంటారు. కొన్నాళ్లకు భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలుస్తుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఉద్యోగం పోతుంది. తర్వాత జరిగే పరిణామాలే సినిమా.
(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా)
మీరు 'కుడుంబస్థాన్' చూస్తున్నంతసేపు నవ్వుతారు, భయపడతారు, ఆలోచిస్తారు. ఎందుకంటే నవీన్ పాత్రకు చాలామంది మధ్య తరగతి యువకులు రిలేట్ అవుతారు. డబ్బులు సంపాదించకపోతే తల్లి-భార్య-తండ్రి.. ఇలా ఏ ఒక్కరు గౌరవం ఇవ్వరు అనే విషయాన్ని చూపించిన విధానం మనసుకు గుచ్చుకుంటుంది.
నవీన్ కి నసపెట్టే బావ ఒకడు ఉంటాడు. ఆ పాత్ర చూస్తున్నంతసేపు ఇలాంటివాడు మన ఇంట్లో ఒకడు ఉంటే అంతే సంగతిరా బాబు అనిపిస్తుంది. మరోవైపు హీరో కాస్త డబ్బులు సంపాదిద్దామని బేకరీ పెడతాడు. కొన్నాళ్లు బాగానే ఉంటుంది కానీ హీరో షాప్ ఎదురుగా మరో బేకరీ ఓపెన్ అవుతుంది. హీరో కష్టాలు మళ్లీ మొదటకొస్తాయి. సరేలే అని రియల్ ఎస్టేట్ విషయంలో ఒక కోటీశ్వరుడికి సాయం చేస్తే వాడేమో చెప్పిన దానికంటే తక్కువ డబ్బులిస్తాడు. ఇలా ప్రతిదగ్గర తన అహం వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడు. చివరకు తన అహాన్ని తీసి పక్కనబెట్టాడా లేదా అనేదే మూవీ.

ఎవరెలా చేశారు?
తమిళంలో మణికందన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మధ్య తరగతి కుర్రాడిగా భలే సెట్ అవుతాడు. ఇందులోనూ నవీన్ పాత్రలో జీవించేశాడు. వెన్నెల పాత్ర చేసిన తెలుగమ్మాయి శాన్వి మేఘన కూడా సరిగ్గా సెట్ అయిపోయింది. ఇక హీరో తల్లిదండ్రులు, అక్క-బావ, ఫ్రెండ్ పాత్రధారులు తమకిచ్చిన పనికి పూర్తి న్యాయం చేశారు. సింపుల్ గా ఉంటూ నచ్చేసే ఓ ఫ్యామిలీ డ్రామా మూవీ చూడాలంటే 'కుడుంబస్థాన్' ట్రై చేయండి.
-చందు డొంకాన
(ఇదీ చదవండి: 'కోర్ట్'లో ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.. ఎవరీ 'జాబిలి'?)
Comments
Please login to add a commentAdd a comment