క్వాలిటీ యానిమేటెడ్ చిత్రాలతో ఆడియెన్స్‌ను మెప్పించడం పిక్సర్‌కు కొత్తేం కాదు. డిస్నీ వాళ్లతో చేతులు కలిపాక.. కథాబలం ఉన్న సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన చిత్రమే ‘లూకా’. ఒక వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న సినిమా రీసెంట్‌గా డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యింది.
టైటిల్: లూకా
ఓటీటీ: డిస్నీఫ్లస్ హాట్‌స్టార్
డైరెక్టర్ : ఎన్రికో కాసరోసా
కాస్టింగ్: జాకోబ్ ట్రెంబ్లె, జాక్ డైలాన్ గ్రేజర్, ఎమ్మా బెర్మన్, మార్కో బెర్రిసిల్లా, సవేరియో రొయిమోండో(వాయిస్ ఓవర్)
మ్యూజిక్: డాన్ రోమర్
రన్ టైం: గంటా 35 నిమిషాలు
కథ..
లూకా పగురో.. ఒక సీ మాంస్టర్కుర్రాడు. రాను రాను సముద్రం అడుగున జీవనం అతనికి బోర్‌గా అనిపిస్తుంది. భూమ్మీద బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కుతుహలం ఆ కుర్రాడిలో రోజురోజుకీ పెరిగిపోతుంటుంది. అయితే తల్లిదండ్రులు(సీ మాంస్టర్లు) మాత్రం వద్దని గట్టిగానే హెచ్చరిస్తారు. ఓరోజు చెప్పాపెట్టకుండా భూమ్మీదకు బయలుదేరుతాడు. నీటి నుంచి ఒడ్డుకు వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నప్పుడు మరో సీ మాంస్టర్కుర్రాడు అలబర్టో స్కోఫానో తారసపడతాడు. తాను చాలాసార్లు భూమ్మీదకు వెళ్లానని చెప్పి.. తనతో పాటు రమ్మని తీసుకెళ్తాడు అలబర్టో. ఆ ఇద్దరూ కలిసి తీర ప్రాంతం పోర్టోరోసోపై అడుగుపెడతారు. తమకున్న విచిత్ర గుణంతో ఆ ఇద్దరూ వెంటనే మనుషుల్లా మారిపోతారు. ఆ ఊరిలో ఆ పిల్లలకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? లూకా ఊహకు తగ్గట్లే భూమ్మీద ఉంటుందా? మనుషులకు వాళ్ల నిజస్వరూపాలు తెలుస్తాయా? చివరికి లూకా ఏమవుతాడు? అనేది మిగతా కథ..
విశ్లేషణ
లూకా ఒక ఫాంటసీ కథ. ఇటలీ జానపద కథలు, పిల్లల పుస్తకాల్లో కనిపించే సీ మాంస్టర్ కథల ఆధారంగా దర్శకుడు ఎన్రికో కాసరోసా అల్లుకున్న కథ. ఈ సినిమా అన్ని వర్గాలను అలరిస్తుంది..లూకా పడే పాట్లు నవ్వులు పంచుతాయి. ముఖ్యంగా విరుద్ధ మనస్తత్వాలున్న ఆ పిల్లల మధ్య స్నేహం.. భావోద్వేగాల్ని పుట్టిస్తుంది. సున్నితంగా ఉండే లూకా.. సముద్రంలో వెళ్లే బోట్ల నుంచి సామాన్లు దొంగతనం చేసేంత తెగింపు ఉన్న అలబర్టో మధ్య స్నేహం కథకు ప్రధాన బలం.
వీళ్ల సాహసాలు, వీళ్ల స్నేహాన్నే నమ్ముకున్న చిన్నారి గియులియా, సీ మాంస్టర్లంటే రగిలిపోయే ఒడ్డున ఉండే మనుషులు, వెస్పా బండి మీద ప్రయాణం కోసం ఉవ్విళ్లూరే లూకా-అల్బర్టోలు.. వాళ్లని తరిమే బామ్మలు, లూకా కోసం పరితపించే తల్లిదండ్రులు(సీ మాంస్టర్లు), ఒంటరి తండ్రి బాగోగుల కోసం తల్లడిల్లే అలబర్టో.. ఇలా పాత్రల తీరుతెన్నులు కథలో లీనమయ్యేలా చేస్తాయి. ఇక సంక్లిష్టమైన కథల్ని కదిలే బొమ్మల ద్వారా అందంగా చూపించడంలో పిక్సర్ మరోసారి సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు.
టెక్నికల్ కోణంలో..
లూకాకు ప్రధాన బలం విజువల్స్. 50, 60వ దశకాల్లో ఇటలీ సుందర దృశ్యాలు(యానిమేటెడ్) ఆకట్టుకుంటాయి. విజువల్ టీం ఆరు నెలలపాటు గ్రౌండ్‌వర్క్ చేసి పడ్డ కష్టం అలరిస్తుంది.. ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక క్యారెక్టరైజేషన్ డిజైన్లు, వాటికి తగ్గ ఆర్టిస్టుల వాయిస్ ఓవర్.. అన్ని ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్గా అందించాయి. డాన్ రోమర్ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది.
అయితే గత పిక్చర్ సినిమాలతో పోలిస్తే.. లూకాలో స్టోరీ టెల్లింగ్ కొంత వీక్‌గా అనిపిస్తుంది. ఇక దర్శకుడు కాసారోసాకు ఇది తొలి సినిమా. జెనోవాలో తన చిన్ననాటి స్నేహితుడితో పంచుకున్న అనుభవాల నుంచే ఈ కథను రాసుకున్నాడు. అందుకు తగ్గట్లే ఫ్రెండ్షిఫ్ థీమ్‌ను బలంగా చూపించడంతో ఈ ‘డబుల్ లైఫ్’ లూకా వ్యూయర్స్‌కి అందమైన అనుభవాన్ని అందిస్తూ ఆకట్టుకోగలుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment