మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. వివాదాలు, విమర్శలకు మాత్రం పుల్‌స్టాప్ పడడం లేదు. ముఖ్యంగా ఎన్నికలు జరిగిన తీరుపై ప్రకాశ్ రాజ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు.. తన ప్యానల్ తరపున గెలిచిన 11 మందితో రాజీనామాలు చేయించాడు. ఇదే సమయంలో కౌంటింగ్ సందర్భంగా అవకతవకలు జరిగాయని ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు. ఆయన ప్యానల్ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయిన యాంకర్ అనసూయ సైతం పోలింగ్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది.
ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆమె విజయం సాధించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో అనసూయతో పాటు ప్రకాశ్ రాజ్ ప్యానల్ షాక్‌కు గురైంది. దీనిపై ‘‘రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా’ అంటూ ఆమె సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. ఇక మంగళవారం ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి బ్యాలట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు.
తాజాగా ఈ ఆరోపణలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన కృష్ణమోహన్.. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారికంగా అనౌన్స్ చేయడానికి ముందే ఆమె గెలిచినట్టు మీడియాలో ప్రచారం జరిగిందని కృష్ణమోహన్ చెప్పారు. తాను బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లానని చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బ్యాలెట్ పేపర్లను ఉంచిన బాక్స్‌ల తాళాలను మాత్రమే తాను ఇంటికి తీసుకెళ్లానని కృష్ణమోహన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment