సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్. ఈసారి అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, యువ కథానాయకుడు మంచు విష్ణు పోటీ పడనున్న విషయం తెలిసిందే. అలాగే జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నర్సింహారావు కూడా పోటీ పడనున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం మార్చిలోనే ముగియడంతో ప్రస్తుత కమిటీలో ఉన్న కొందరు తక్షణమే ఎన్నికలు జరిపాలంటూ క్రమశిక్షణా సంఘం కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజుకి లేఖలు రాశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ‘వర్చ్యువల్’ మీటింగ్ జరిగిందని సమాచారం. ఈ మీటింగ్‌లో క్రమశిక్షణా సంఘం సభ్యులు గిరిబాబు, మోహన్‌బాబు, మురళీమోహన్, శివకృష్ణ పాల్గొన్నారని భోగట్టా.
తక్షణమే ఎన్నికలు జరపాలనే అంశంపై చర్చ జరిగిందని, కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే కష్టమేనని చర్చించుకున్నారని, సెప్టెంబర్‌లో జరిపేలా నిర్ణయానికి వచ్చారని సమాచారం. సెప్టెంబర్ 12న ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిసింది. అలాగే ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు జరిపేవరకూ వారికి అధికారం ఉంటుందా? అనే విషయం కూడా చర్చకు వచ్చిందని సమాచారం. ఎన్నికలు జరిగే వరకూ ప్రస్తుత కార్యవర్గానికి అధికారం ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది. వచ్చే నెల 22న సర్వసభ్య సమావేశం జరుగుతుందని, ఆ మీటింగ్‌లో ఎన్నికల తేదీని వెల్లడించే అవకాశం ఉందని భోగట్టా.
Comments
Please login to add a commentAdd a comment