‘ప్రకాశ్‌రాజ్‌కు బీపీ మాత్ర ఇస్తే బాగుంటుంది. ఆయన అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారు. మీడియా ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రియల్ లైఫ్‌లోనూ ఆయన బాగా నటిస్తున్నారు. నేరాలు-ఘోరాలు జరిగిపోతున్నాయని అంటున్నారు. ఆయనకు పగ-ద్వేషాలు ఎందుకో నాకు తెలియడం లేదు’అన్నారు మంచు విష్ణు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)ఎన్నికల బరిలో అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ఆయన మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఉదయం ప్రకాశ్ చెప్పిన ప్రతి అంశానికీ ఆయన వివరణ ఇచ్చాడు. ఒక కుటుంబంలో జరిగే ఎన్నికల్లో ప్రతి విషయాన్ని తీసుకొచ్చి, ప్రకాశ్‌రాజ్ మీడియా ముందు పెడుతున్నారని, ప్రతి దానికీ తీవ్రంగా స్పందిస్తున్నారని మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు ఆరోపించారు.
‘మా’లో సుమారు 190మంది 60 సంవత్సరాలు పైబడిన వాళ్లు ఉన్నారు. వీళ్లందరినీ నేను వ్యక్తిగతం ఫోన్ చేశా. ‘మీకు పోస్టల్ బ్యాలెట్ కావాలా? నేరుగా వచ్చి ఓటు వేస్తామని 100మందికి పైగా చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు, ఇక్కడే నగరంలో ఉన్న పరుచూరి బ్రదర్స్ వంటి పెద్దలు ‘పోస్టల్ బ్యాలెట్‌కు వెళ్తా’మని చెప్పారు. అయితే, మీరు ఒక లేఖ ఎన్నికల సంఘానికి పంపాలని సూచించా. ఎలా పంపాలో వాళ్లకు తెలియకపోతే ఒక లెటర్ ఫార్మాట్ పంపా. అయితే, ఎవరికి వారే కొరియర్ చేసుకున్నారు. ఆ లెటర్లను ఒక వ్యక్తి మాత్రం తీసుకురాలేదు. పోస్టల్ బ్యాలెట్ కావాలంటే రూ.500 కట్టమని ఎన్నికల సంఘం ‘మా’ సభ్యులకు ఎస్‌ఎంఎస్ పంపింది.
దాంతో పలువురు పెద్దలు నాకు ఫోన్ చేసి అడిగారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ ముఖ్యమే. అందుకే ‘మీ అందరి తరపున ఆ రూ.500 నేను కడతా’ అని వాళ్లకు చెప్పా. ఇదే విషయమై ఎన్నికల సంఘం దగ్గరి వచ్చి అడిగాం. వాళ్లు ఒప్పుకొన్నారు. న్యాయబద్ధంగా కట్టాం. కొన్ని గంటల తర్వాత ఎన్నికల సంఘం నుంచి మాకు ఫోన్ వచ్చింది. ‘పోస్టల్ బ్యాలెట్‌కు డబ్బులు చెల్లించేందుకు సభ్యులకు సమయం ఇస్తాం. మీ డబ్బులు మీరు తీసుకెళ్లండి’ అని చెప్పారు. వాళ్లు చెప్పగానే వచ్చి, డబ్బులు తీసుకున్నాం. అన్నీ లీగల్‌గానే జరిగాయి.
ఈ విషయాన్ని తెలుసుకోకుండా ప్రకాశ్ రాజ్ ఏదేదో మాట్లాడుతున్నాడు. నోరు ఉంది కదాని పెద్దా-చిన్నా తేడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడకూడదు. కృష్ణంరాజు, కృష్ణగార్లను అవమానిస్తారా? ప్రకాశ్ రాజ్ మాట్లాడేది చాలా తప్పు. నా గురించి మాట్లాడండి కానీ నా ఫ్యామిలీ గురించి మాట్లాడ వద్దు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఓటు అడిగే హక్కు నాకుంది. నేను రైట్ వే లో వున్నాను. ఇక్కడ ‘మా’ ఇల్లు నీ పాడు చేసేందుకు కంకణం ఆయన కట్టుకున్నాడు. జీవిత గారు మీరు చెప్పేది కరెక్ట్ గా చెప్పండి .నాలుగు రోజులు ముందు రాజశేఖర్ గారు వచ్చి మోహన్ బాబు గారితో ఏమి చెప్పారో మీకు తెలీదు. ఉమ్మడి కుటుంబం లో కొన్ని సమస్యలు వుంటాయి వాటిని రోడ్డు మీదకు తీసుకు రావద్దు’అని మంచు అన్నారు.
ఒక మంచి వాడు, తెలుగు వాడు ‘మా ’కు రావాలి: నరేశ్
గతంలో జరిగిన ఎలక్షన్స్ బాగానే జరిగాయి. కానీ ఇప్పుడు ప్రతి విషయాన్ని తెగే దాకా లాగుతున్నారు. ఇక్కడ ఒక బ్యాచ్ తయారైంది. అది ‘మా’ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ నీ కోరుతూ విష్ణు లెటర్ ఇచ్చాడు. ఒక మంచి వాడు, తెలుగు వాడు ‘మా ’కు రావాలి అని నేను కోరుకుంటున్నాను. మతి స్థిమితం లేని ప్రకాశ్ రాజ్ కు ఎన్నికలు అవసరమా?’అని నరేశ్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment