Madras High Court Notice To 'Maamannan' Udhayanidhi Stalin - Sakshi
Sakshi News home page

నువ్వు చివరి చిత్రమని ప్రకటిస్తే నేనేం కావాలి: నిర్మాత

Published Sat, Jun 24 2023 8:12 AM | Last Updated on Sat, Jun 24 2023 8:56 AM

Maamannan Udhayanidhi Stalin Court Notice - Sakshi

కోలీవుడ్‌లో 'మామన్నన్‌' చిత్ర విడుదలపై నిషేధం విధించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.  నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ కథానాయకుడిగా నటించి, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకంపై నిర్మించిన చిత్రం మామన్నన్‌. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంజల్‌ చిత్ర నిర్మాత రామశరవణన్‌ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో తాను ఉదయనిధి స్టాలిన్‌, ఆనంది, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరో హీరోయిన్లుగా ఏంజెల్‌ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నానన్నారు.

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి)

కేఎస్‌.అదయమాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ షూటింగ్‌ 80 శాతం పూర్తి అయ్యిందని, మరో 20 శాతం చేయాల్సి ఉంటుందని తెలిపారు. కాగా ఉదయనిధి స్టాలిన్‌ తన చిత్రాన్ని పక్కనపెట్టి మామన్నన్‌ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయడానికి సిద్ధమయ్యారన్నారు. అంతేకాకుండా మామన్నన్‌ తన చివరి చిత్రం అని ప్రకటించారన్నారు. తాను ఏంజెల్‌ చిత్రం కోసం ఇప్పటి వరకు రూ.13 కోట్లు ఖర్చుపెట్టానని తెలిపారు. తాను చిత్రం పూర్తి కాకపోతే చాలా నష్టపోతానన్నారు.

(ఇదీ చదవండి: రోజుకు వెయ్యిమందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌: చిరంజీవి)

కాబట్టి మామన్నన్‌ చిత్రం విడుదలపై నిషేధం విధించి తన చిత్రాన్ని పూర్తిచేయాల్సిందిగా ఉదయనిధి స్టాలిన్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తి కుమరవేల్‌ బాబు సమక్షంలో విచారణకు వచ్చింది. దీంతో ఈ కేసుపై విచారణ కోరుతూ ఉదయనిధి స్టాలిన్‌కు, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థకు నోటీసులు జారీ చేసి తర్వాత విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement