ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘గోళం’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలో ఎన్ని కథలు ఉన్నాయని అడిగితే... ప్రపంచ జనాభా ఎంతమంది ఉంటే అన్ని కథలు ఉన్నాయన్నట్టు... ప్రతి వ్యక్తికి సంబంధించిన జీవితం ఓ సినిమా కథే. కాకపోతే ఆ కథలను ఎంచుకోవడంలోనే ఉంటుంది అసలు ఆయువుపట్టు. ఈ విషయంలో మలయాళ దర్శకులు చాలా ముందుంటారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ వేదికగా వస్తున్న పలు చిత్రాలు మలయాళ దర్శకుల ఆలోచనా పటిమకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాటిలో ‘గోళం’ ఒకటి. సమ్జాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రకథ ఆయువు పట్టును చివరి వరకూ ప్రేక్షకులు కనిపెట్టలేరు. అంతగా రక్తి కట్టించే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని కట్టిపడేస్తుందీ సినిమా.
ఈ చిత్రకథ విషయానికొస్తే... ఓ ఆఫీసులో బాస్ అనుకోకుండా బాత్రూంలో చనిపోయినపుడు ఆఫీసులో స్టాఫ్ తప్ప ఇంకెవరూ ఉండరు. దీనిని ఇన్వెస్టిగేట్ చేయడానికి సందీప్ కృష్ట తన టీమ్‌తో ఆఫీస్‌కు వస్తాడు. డే టైమ్ ఆఫీసులో బాస్ ఎలా చనిపోయాడు? హంతకుడు ఎవరు? ఇదే ‘గోళం’ సినిమా. ఇన్వెస్టిగేషన్ ఊహకందని ట్విస్టులతో, ఊహించని క్లైమాక్స్‌తో సాగుతుందీ సినిమా. ఆద్యంతం రక్తి కట్టే ఈ సినిమా చూశాక నేటి ఆఫీసుల్లో రిజిష్టర్ పంచ్ వేసేందుకు ఉపయోగించే మెషీన్‌ను చూడడానికి కూడా భయపడవచ్చు. ఎందుకో ఏమిటో ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ‘గోళం’ చూసేయండి. ‘గోళం’... వర్త్ టు వాచ్ ఇట్.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment