యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ చాలామందికి ఇష్టమైనవి ఫీల్ గుడ్ మూవీసే. తెలుగులో అప్పుడప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలు వస్తుంటాయి. అలాంటి ఓ సినిమా 'మనమే'. శర్వానంద్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. తాజాగా జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో? టాక్ ఏంటి అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
విక్రమ్(శర్వానంద్) లండన్‌లో ఉంటాడు. అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఇతడికి అనురాగ్ (అదిత్) అనే ఓ ఫ్రెండ్. ఇండియా వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరగడంతో అనురాగ్, అతడి భార్య చనిపోతారు. వీళ్ల కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) ప్రాణాలతో బయటపడతాడు. ఈ పిల్లాడిని కొన్ని నెలల పాటు చూసుకోవాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)పై పడుతుంది. లండన్‌లో అనురాగ్ ఇంట్లోనే ఉంటూ పిల్లాడిని చూసుకుంటారు. మరి ఖుషిని చూసుకునే క్రమంలో విక్రమ్ ఏం తెలుసుకున్నాడు? ఇంతకీ సుభద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
తల్లిదండ్రులు-పిల్లల మధ్య ఎలాంటి ప్రేమ-బాండింగ్ ఉండాలి? అనేదే 'మనమే' కాన్సెప్ట్. ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ స్టోరీ అని చెప్పుకొచ్చారు కానీ సినిమాలో ఎమోషన్ అక్కడక్కడే వర్కౌట్ అయింది. అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ జాలీగా ఉండే హీరో.. ఫ్రెండ్ చనిపోవడంతో అతడి కొడుకు బాధ్యత చూసుకోవాల్సి రావడం, ఇతడు ఒక్కడే కాకుండా అప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిన ఓ అమ్మాయి కూడా పిల్లాడ్ని చూసుకోవాల్సి రావడం.. ఇలా సీన్స్ సరదాగా వెళ్తుంటాయి. హీరో ఫ్రెండ్ చనిపోవడానికి అతడి బిజినెస్ పార్ట్‌నర్ కారణం అని హీరోహీరోయిన్ తెలుసుకోవడం, ఫ్రెండ్ మరణంతో మూతపడిన రెస్టారెంట్‌ని హీరోహీరోయిన్ కలిసి మళ్లీ సక్సెస్ చేయడం లాంటి వాటితో ఫస్టాప్ ఓ మాదిరిగా ఉంటుంది.
సెకండాఫ్ వచ్చేసరికి సినిమా పూర్తిగా సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎటేటో పోయింది. తెరపై సన్నివేశాలు వస్తుంటాయి పోతుంటాయి. ఏం జరుగుతుందిరా అని చూస్తున్న ప్రేక్షకుడు కాస్త కన్ఫూజ్ అవుతాడు. కానీ చివరకొచ్చేసరికి హీరో-అతడి తల్లిదండ్రుల మధ్య మంచి ఎమోషనల్ సీన్స్, పెద్దగా ట్విస్టులేం లేకుండా క్లైమాక్స్‌లో ఎండ్ కార్డ్ పడుతుంది. ఏం జరుగుతుందో మనం ఊహించేయొచ్చు.
సినిమాలో ఖుషి అనే పిల్లాడిది కీలక పాత్ర. కానీ అతడి క్యారెక్టర్ ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. ఎందుకంటే ఒకటి రెండు కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి తప్పితే చాలావరకు మనం పూర్తిగా ఆ పిల్లాడికి కనెక్ట్ కాలేకపోతాం. సినిమా అంతా రిచ్‌గా చూడటానికి కలర్ ఫుల్‌గా ఉంటుంది. కానీ ఎమోషన్ కాస్త మిస్ అయింది. నిడివి రెండున్నర గంటలు.. కాకపోతే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్, స్పెషల్ సాంగ్ ట్రిమ్ చేసినా పర్లేదు! ఇదే స్టోరీని లండన్‌లో కాకుండా ఇండియాలో ఉన్నట్లు రాసుకున్నా సరే పెద్దగా మార్పులుండవేమో? విలన్ ట్రాక్ అయితే అసలు ఎందుకు పెట్టారో, మధ్యలో ఎందుకు వదిలేశారో అర్థం కాదు.
ఎవరెలా చేశారు?
విక్రమ్‌గా చేసిన శర్వానంద్.. తన పాత్రకు న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే గ్లామరస్‌గా కనిపించాడు. సుభద్రగా చేసిన కృతిశెట్టికి ఫెర్ఫార్మెన్స్‌తో పర్వాలేదనిపించింది. ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కొడుకే.. ఇందులో ఖుషి అనే పిల్లాడిగా చేశాడు. డైలాగ్స్ లాంటివి లేకుండా హావభావాలతోనే దాదాపు సీన్స్ అన్నీ ఉంటాయి. పిల్లాడితో ఇంకాస్త ప్రాక్టీస్ చేయించుంటే బాగుండేది. ఎందుకంటే చాలాచోట్ల మేనేజ్ చేసినట్లు తెలిసిపోతుంది. మిగిలిన యాక్టర్స్ తమకు ఇచ్చిన పనికి న్యాయం చేశారు.
టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. లండన్ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే తడబడ్డాడు. సినిమాని చాలా సాగదీశాడు.
రేటింగ్: 2.75
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment