తొలి స్వతంత్ర సమరయోధురాలు వేలు నాచియార్ జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కనుంది. దీనికి మరుదుస్క్వేర్ అనే పేరును నిర్ణయించారు. దీన్ని జే.ఎం.బషీర్ తన ఫ్రెండ్స్ సినిమా పతాకంపై నిర్మించి పెద్ద మరుదు పాత్రను పోషించనున్నారు. ఈయన ఇప్పటికే దేశీయతలైవర్ చిత్రంలో టైటిల్ పాత్ర పసుమ్ పొన్ ముత్తురామలింగ దేవర్‌గా నటిస్తున్నారు. కాగా ఇందులో వేలు నాచియార్ అనే ప్రధాన పాత్రను బషీర్ కూతురు ఆయిషా పోషించనున్నారు. ఈమె 2019లో మిస్ చెన్నై అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకున్నారు. నటనపై ఆసక్తితో అందుకు కావలసిన శిక్షణ పొందారు.
శ్రీధర్ మాస్టర్ వద్ద డాన్స్, స్టంట్ మాస్టర్లు తవసీరాజ్, మిరాకిల్ మైఖెల్ ఫైట్స్‌లో శిక్షణ పొందారు. అదేవిధంగా మదుర్ ముత్తు లక్ష్మి వద్ద సిలంబాట్టం వంటి విలు విద్యలు నేర్చుకున్నారు. ఈ చిత్రానికి ఊమై విళిగల్, ఉళవన్ మగన్ చిత్రాల ఫేమ్ అరవింద్ రాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ప్రస్తుతం జెఎం.బషీర్ టైటిల్ పాత్రను పోషించిన దేశీయతలైవన్ చిత్రాన్ని పూర్తిచేశారు. ఈ చిత్రం విడుదల తరువాత మరుదు స్క్వేర్ చిత్రాన్ని సెట్ పైకి తీసుకెళ్లనున్నట్లు చిత్రం వర్గాలు గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. ఈ సినిమాకు ఒక ప్రముఖ సంగీత దర్శకుడు సంగీతాన్ని అందించనున్నారని, అదేవిధంగా చిన్న మరుదు పాత్రను పోషించడానికి ఒక ప్రముఖ నటుడితో చర్చలు జరుగుతున్నాయని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment