
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంపై యావత్ భారత్ సంతోషం వ్యక్తం చేసింది. ఇక రాజమౌళి, కీరవాణిల ఫ్యామిలీ ఆనందం మాటల్లో చెప్పలేం. కొడుకు ఉన్నతిని చూసి ఉప్పొంగిపోయాడు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా. అదే సమయంలో ఆయన నాటు నాటు పాటపై చేసి ఘాటు కామెంట్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
'నాకు సినిమా అంటే ప్యాషన్. మేము నలుగురు అన్నదమ్ములం. మేమంతా తుంగభద్ర ఏరియాకు వలస వెళ్లాం. అక్కడ 16 సంవత్సరాలు ఉన్నాం. ఆ ప్రాంతంలో 300 ఎకరాలు కొన్నాను. కానీ సినిమా కోసం భూమినంతా అమ్మేశా. చివరికి ఈరోజు పూట గడవడం ఎలా? అన్న పరిస్థితికి వచ్చాం. ఆ సమయంలో విజయేంద్రప్రసాద్, నేను కలిసి మంచి మంచి కథలు రాశాం. జానకిరాముడు, కొండవీటి సింహం.. ఇలా ఎన్నో హిట్ సినిమాలకు మేము పని చేశాం! కానీ అప్పటిదాకా కీరవాణి చక్రవర్తి దగ్గర పని చేస్తే వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేది.
కీరవాణి నా పంచప్రాణాలు. మూడో ఏట నుంచే అతడికి సంగీతం నేర్పాను. తన టాలెంట్ చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌లో నాటు నాటు పాట నాకు నచ్చలేదు. అసలు అది ఒక పాటేనా? అందులో సంగీతం ఎక్కడుంది. విధి విచిత్ర వైచిత్రమిది. కానీ ఇన్నాళ్లూ అతడు చేసిన కృషికి ఈ రూపంలో ఫలితం వచ్చింది. చంద్రబోస్ రాసిన 5 వేల పాటల్లో ఇదొక పాటా? కీరవాణి ఇచ్చిన సంగీతంలో ఇదొక మ్యూజికేనా? ఏమాటకామాటే.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉంది. దానికి తారక్, చరణ్ డ్యాన్స్ మహా అద్భుతం. వీళ్ల కృషి వల్ల ఆస్కార్ దక్కడం గర్వించదగ్గ విషయం' అన్నారు శివశక్తి దత్తా.
Comments
Please login to add a commentAdd a comment