స్వతహాగా మలయాళీ హీరో అయిన్ మోహన్ లాల్ (Mohanlal).. 'దృశ్యం' సినిమాలతో మంచి పాపులరిటీ సొంతం చేసుకున్నారు. తెలుగులో 'జనతా గ్యారేజ్' మూవీలోనూ చేశారు. అలా తెలుగు ప్రేక్షకులకు ఈయన సుపరిచితుడే. 400కి సినిమాల్లో నటించిన ఈయన తొలిసారి 'బరోజ్' (Barroz Movie) అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఇందులో ఈయనే హీరోగానూ నటించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? మోహన్ లాల్ డైరెక్టర్‌గా హిట్ కొట్టారా అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా డి గామా వంశంలోని 13వ జనరేషన్‌కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్‌ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
మనలో చాలామంది చిన్నప్పుడు చందమామ కథలు చదివే ఉంటారు. హాలీవుడ్ కార్టూన్ డబ్బింగ్ మూవీస్ కూడా చూసే ఉంటారు. అయితే అవి డబ్బింగ్ మూవీస్ కాబట్టి ఆ మైండ్ సెట్‌తోనే చూస్తాం. అర్థం కాకపోయినా సరే ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి సినిమానే మన దగ్గర తీస్తే.. మనకు రిలేట్ అవుతుందా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేస్తాం. కానీ 'బరోజ్' మాత్రం పేరుకే మలయాళ మూవీ కానీ.. ఏదో ఇంగ్లీష్ మూవీ చూస్తున్నామా అనిపిస్తుంది. రెండున్నర గంటల నిడివి అయినప్పటికీ నాలుగు గంటల మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‍తో 'బరోజ్' మొదలవుతుంది. ఫాదో గీతంతో ఈ మూవీని ప్రారంభిద్దామని అంటారు. అసలు ఫాదో గీతం అంటే ఏంటి అనుకునేలోపు.. సడన్‌గా పోర్చుగీస్ పాట ప్లే అవుతుంది. దీని మీనింగ్ ఏంటో అర్థం కాదు. ఇదొక్కటే కాదు మూవీ అంతా దాదాపు ఇదే కన్ఫ్యూజన్. నిధిని కాపాడే భూతంగా బరోజ్ ఎంట్రీ.. అసలు ఈ నిధి సంగతేంటి? దెయ్యంగా ఎందుకు మారాడు? ఈ నిధిని ఎవరికి అప్పగించాలి అనే అంశాలే సినిమా కథ.
నిధికి కాపలాగా భూతం ఉండటం.. 400 ఏళ్లుగా ఒకే గదిలో ఈ భూతం ఉండిపోవడం.. లైన్ చూస్తుంటే మంచి హాస్యం పుట్టించొచ్చు. నిధిని ఎవరైనా కొట్టేయడానికి వస్తే ఆ సీన్లని అడ్వెంరెస్‌గా తీయొచ్చు. కానీ 'బరోజ్'లో అలాంటి సన్నివేశాలే ఉండవు. హీరోగా నటించి దర్శకత్వం వహించింది మోహన్ లాల్ కదా. అంతా ఆయన కనిపిస్తాడనుకుంటే.. అడపాదడపా కనిపిస్తాడు. ఈయన పాత్ర భూతం కదా. జీనీలా అద్భుతాలు చేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతని కలిగించొచ్చు.
కానీ మోహన్ లాల్ అలా చేయలేకపోయారు. సినిమా ప్రారంభం నుంచి ఈయన మార్క్ చూపించే, అరె భలే ఉందే అనిపించే సీన్ ఒక్కటీ ఉండదు. మోహన్ లాల్ కాకుండా మిగిలిన సీన్లలో మనకు ఏ మాత్రం పరిచయం లేని విదేశీ నటులు వచ్చిపోతుంటారు. ఒకరు తెలుగులో మాట్లాడితే మరొకరు పోర్చుగీస్‌లో మాట్లాడుతుంటారు. ఇది ఇబ్బందిగా అనిపించింది.
హాలీవుడ్ సినిమాలని చూసిన మోహన్ లాల్.. వాటి స్ఫూర్తితో సినిమా చేద్దామని ఫిక్సయ్యారు. కానీ ప్రాంతీయ ప్రేక్షకులని ఆకట్టుకునేలా తీయలేకపోయారు. నేటివిటీ లేక ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయ్యారు. ఇలాంటి పాయింట్ కోసం పోర్చుగీస్ కథల వరకే వెళ్లాల్సిన అవసరం లేదు. మన జానపదాలు వెతికితే ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి. ఆ దిశగా మోహన్ లాల్ ఆలోచించి ఉంటే లోకల్ ఆడియెన్స్‌కి సినిమా ఇంకా నచ్చి ఉండేది. దర్శకుడిగా త్రీడీ మూవీ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని తపించిన మోహన్ లాల్.. కంటెంట్‌పై సరిగా దృష్టి పెట్టలేదు. దీంతో మూవీ అటోఇటో అన్నట్లు సాగుతూ వెళ్తుంది.
ఎవరెలా చేశారు?
బరోజ్‌గా టైటిల్ రోల్ చేసిన మోహన్ లాల్.. పాత్రలో సరిగ్గా సరిపోయారు. హీరో కమ్ డైరెక్టర్ నేనే కదా అని అనవసర ఎలివేషన్ల జోలికి పోలేదు. పాత్రకు ఎంత కావాలో అంత ఇచ్చారు. కానీ ఇంకాస్త థ్రిల్లింగ్, ఎంటర్‌టైనింగ్‌గా బరోజ్ పాత్రని రాసుకుని ఉంటే బాగుండేది. ఇషా పాత్ర చేసిన మాయారావు చూడటానికి బాగుంది. యాక్టింగ్ ఓకే ఓకే. మిగిలిన విదేశీ నటీనటులు బాగానే చేశారు.
టెక్నికల్ విషయాలకొస్తే సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫీ బాగుంది. అండర్ వాటర్ త్రీడీ విజువల్స్ ఔట్‌పుట్ మాత్రం అనుకున్నంతగా రాలేదు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలే గుర్తొస్తాయి. నిర్మాణ విలువల మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. ఖర్చు విషయంలో అసలు వెనుకాడలేదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ బాగుంది.
ఓవరాల్‌గా చెప్పుకొంటే మోహన్ లాల్ 'బరోజ్'తో కష్టపడ్డారు గానీ కంటెంట్ పరంగా తడబడ్డారు. దీంతో సగటు ప్రేక్షకుడు.. ఇది మా కోసం తీశారా? పోర్చుగీసు వాళ్ల కోసం తీశారా అని సందేహపడటం గ్యారంటీ.
-చందు డొంకాన
Comments
Please login to add a commentAdd a comment