తిరోగమనం పై తీవ్ర నిరసన ‘తిరిగి చూడు’పాట | Mounasri Mallik Talks About India Files Movie And Thirigi Chudu Song | Sakshi
Sakshi News home page

తిరోగమనం పై తీవ్ర నిరసన ‘తిరిగి చూడు’పాట

Published Wed, Aug 21 2024 10:47 AM | Last Updated on Wed, Aug 21 2024 11:05 AM

Mounasri Mallik Talks About India Files Movie And Thirigi Chudu Song

‘తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని... కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషి’... ఈ పాట ఇప్పుడు చాలామంది అభిమానులను సంపాదించుకుంది. రాజకీయవేత్త అద్దంకి దయాకర్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ‘ఇండియా ఫైల్స్‌’ కోసం కీరవాణి పాడి, సంగీతం అందించిన ఈ పాటను రాసింది మౌనశ్రీ మల్లిక్‌. స్వీయ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. గద్దర్‌ కథ అందించిన ‘ఇండియా ఫైల్స్‌’లోని పాటలు యూట్యూబ్‌లో విడుదలై లక్షల వ్యూస్‌ సాధిస్తున్నాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మౌనశ్రీ మల్లిక్‌ వెల్లడించిన అభిప్రాయాలు....

‘ఇండియా ఫైల్స్‌’ కోసం ‘తిరిగి చూడు’, ‘జై ఇండియా’ పాటలు రాశాను. రెండూ పెద్ద హిట్‌ కావడం సంతోషంగా ఉంది. ‘ఇండియా ఫైల్స్‌’ కథలో అద్దంకి దయాకర్‌ గారిది సామాజిక కార్యకర్త పాత్ర. సమాజంలో పేరుకుపోతున్న మూఢత్వాన్ని, తిరోగమనాన్ని చూసి మార్పు రావాలంటే ఏం చేయాలో తెలియ చేయమని తన గురువు (సుమన్‌)ను అడుగుతాడు. దేశమంతా తిరిగి చూస్తే నీకే జవాబు దొరుకుతుంది అని గురువు సూచిస్తాడు. అద్దంకి దయాకర్‌ దేశాన్ని తిరిగి చూసే సందర్భంలో వస్తుందీ పాట.

‘పుణ్యపుడమిలో పరిఢవిల్లిన మేధలేదిపుడెందుకో... ధన్యధరణిలో నెత్తుటేరులు పారుతున్నది ఎందుకో’ అని ఈ పాటలో రాశాను. ఒకప్పుడు మేధావులతో నిండిన ఈ దేశంలో జ్ఞానవికాసానికి బదులు ఛాందసం మొలకెత్తడం బాధాకరం. అందుకే ‘గాయపడిన భరతజాతికి వైద్యమేదో చదువుకో’ అని కూడా రాశాను. నాలుగు చరణాల ఈ పాటను విని దర్శకుడు బొమ్మకు మురళి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్‌ కనకదుర్గ చాలా సంతోషపడ్డారు. కీరవాణిగారైతే ఎంత మెచ్చుకున్నారో తెలియదు. దీనిని నేనే పాడతానని చెన్నైలో తన సంగీత దర్శకత్వంలో రికార్డు చేశారు. పాట రిలీజై ఇంత స్పందన రావడం సంతృప్తిగా ఉంది.

రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడం ‘ఇండియా ఫైల్స్‌’ కథాంశం. రాజ్యాంగం సరిగా అమలైతే పేదవాడు పేదవాడిగా ఉండిపోడని ఈ సినిమాలో చెబుతాం. ‘ప్రశ్నించే వారికి స్వేచ్ఛ ఉండాలి’ అని ఇదే సినిమాలోని ‘జై ఇండియా’ గీతంలో రాశాను.

మాది వరంగల్‌ జిల్లా వర్థన్న పేట. జర్నలిస్ట్‌గా పని చేశాను. చిన్నప్పుడు పేదరికంలో రేడియో ఒక్కటే వినోదంగా ఉండేది. అందులో వినిపించే పాటలే నన్ను కవిని, గీతకర్తను చేశాయి. సామాజిక చైతన్యం కలిగిన కవిగా సాహిత్యవేత్తగా రాణిస్తూనే టీవీ, సినిమాల్లో పని చేస్తున్నాను. కె. రాఘవేంద్రరావు గారు పాటలకు ప్రాధాన్యం ఉన్న ‘కోకిలమ్మ’, ‘కృష్ణతులసి’ సీరియల్స్‌లో నా చేత వరదలాగా పాటలు రాయించడంతో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు టీవీ సీరియల్స్‌కు టైటిల్‌ సాంగ్‌ అనగానే నా పేరే గుర్తుకు వస్తోంది. 

చిన్న సినిమాలకు చాలా పాటలు రాశాను. ‘గుడ్‌ మార్నింగ్‌’ సినిమాకు నేను రాసిన పాటకు 2012లో గీతా మాధురికి నంది అవార్డు వచ్చింది. ‘ఇండియా ఫైల్స్‌ పాటలతో వచ్చిన గుర్తింపుతో ఇకపై సినిమా రంగంలో మరింత ఉత్సాహంగా పాటలు రాయాలని అనుకుంటున్నాను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement