‘‘స్పై థ్రిల్లర్ సినిమాలు తీయడం అంత సులభం కాదు.. అది ఒక సవాల్. ఎందుకంటే ఇలాంటి హాలీవుడ్ సినిమాలను ఓటీటీల్లో చూసేస్తున్నారు. కానీ, ‘స్పై’ టీజర్, ట్రైలర్ చూశాక చాలా బాగా అనిపించింది. అంతర్జాతీయ స్థాయి విలువలకు ఏ మాత్రం తగ్గలేదు. రాజశేఖర్, చరణ్ తేజ్‌ల ప్యాషన్ ఏంటో తెలుస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు.
నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యామీనన్ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పై’. ఈడీ ఎంటర్‌టైన్ మెంట్స్‌పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు(గురువారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. ‘హ్యాపీడేస్’ తో కెరీర్ మొదలుపెట్టి, ‘స్వామిరారా, కార్తికేయ’ తో ఓ ట్రెండ్ సెట్ చేసి, ‘కార్తికేయ 2’ తో బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు.. తనని చూసి నేను చాలా గర్వపడుతున్నాను.
‘కార్తికేయ 2’ తో ఒక ట్రెండ్ ఎలా సెట్ చేశాడో.. ‘స్పై’ చిత్రంతో ఆ ట్రెండ్ దాటి తర్వాతి స్థాయికి వెళతాడనే నమ్మకం ఉంది’’ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ–‘‘సుభాష్ చంద్రబోస్ వంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఉన్న సినిమా ‘స్పై’. నాలుగురోజుల కిందట ఈ మూవీ ఫైనల్ కాపీ చూశాక ‘థ్యాంక్యూ గ్యారీ’ అన్నాను.. అంత బాగా ఈ మూవీ తీశాడు. ఇలాంటి సినిమా చేసినందుకు యూనిట్ అంతా గర్వపడుతున్నాం. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఒక్క ఫోన్ కాల్‌తో ‘స్పై’ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చిన నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు కె.రాజశేఖర్ రెడ్డి.
గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ–‘‘డాక్టర్ అయిన నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ, నా తల్లితండ్రులు ఒప్పుకుని, నన్నుప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. ‘స్పై’ చాలా బాగా తీశావంటూ నిఖిల్‌గారు నన్ను హత్తుకోవడంతో సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది’’ అన్నారు. ఈ వేడుకలో ఈడీ ఎంటర్‌టైన్ మెంట్స్ సీఈఓ చరణ్ తేజ్, సంగీత దర్శకుడుశ్రీచరణ్ పాకాల, కెమెరామేన్ వంశీ పచ్చిపులుసు, యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ, నటీనటులు సాన్య ఠాకూర్, ఆర్యన్ రాజేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment