నేను ఫిట్‌గా ఉండటానికి కారణం అదే : నాగార్జున | Nagarjuna Speech At Wild Dog Base Camp Event | Sakshi
Sakshi News home page

నేను ఫిట్‌గా ఉండటానికి కారణం అదే : నాగార్జున

Published Mon, Mar 29 2021 12:25 AM | Last Updated on Mon, Mar 29 2021 9:53 AM

Nagarjuna Speech At Wild Dog Base Camp Event - Sakshi

నిరంజన్‌రెడ్డి, సాల్మన్, నవీన్‌ నూలి, గౌతమ్‌ తిన్ననూరి, నాగార్జున, వంశీ పైడిపల్లి, సాయామీ ఖేర్, రాజుసుందరం

‘‘దేనికీ భయపడాల్సిన అవసరం లేదనే ఓ గొప్ప నమ్మకంతో ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాను. కొత్తదనం ఎక్కడ ఉందా? అని వెతుకుతుంటాను. నేను యంగ్‌గా ఫిట్‌గా ఉన్నానంటే కారణం కొత్తవారితో వర్క్‌ చేయడమే. చేసిన పనే చేయడం ఇష్టం ఉండదు. ఒకే రకమైన పాత్రల్లో నన్ను నేను చూసుకోవడం నాకు బోర్‌ కొడుతుంది. బోర్‌ కొట్టే పని చేయను’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ‘వైల్డ్‌డాగ్‌ ఏప్రిల్‌ 2న విడుదల కానుంది.

ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా బేస్‌ క్యాంప్‌ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ – ‘‘వైల్డ్‌డాగ్‌’ కథ నాకు నచ్చడానికి కారణం ఏసీపీ విజయ్‌వర్మ క్యారెక్టర్‌. విజయ్‌ వర్మ మంచి తండ్రి, మంచి మానవతావాది, మంచి భర్త, మంచి టీమ్‌ లీడర్‌. ప్రేమించిన దానికోసం ఏమైనా చేస్తాడు. అతను ప్రేమించేది భారతదేశాన్ని. నేను చేసిన సినిమాల్లో వన్నాఫ్‌ ది స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ విజయ్‌ వర్మ. ఈ సినిమాకు నిజమైన వైల్డ్‌డాగ్‌ నిర్మాత నిరంజన్‌రెడ్డి. గగనం, క్షణం, ఘాజీ, ఊపిరి వంటి డిఫరెంట్‌ సినిమాలను నిరంజన్‌ చేశారు. ఇదొక ప్రయోగాత్మక సినిమా అనే విషయం పక్కనపెడితే, ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ కూడా.

కోవిడ్‌ కారణంగా కొన్ని రోజులు ఇళ్ళలో ఉండి, ఆ తరవాత షూటింగ్‌ కోసం మనాలీ వెళ్లాం. అక్కడ నా మాస్క్‌ తీసి బయటపడేశాను. నా కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు అర్థం అయ్యింది.. పని అనేది చాలా ఇంపార్టెంట్‌ అని’’ అన్నారు. ‘‘తెలుగులో ప్రయోగాత్మక సినిమా చేయాలనుకునే అందరికీ నాగార్జునగారు ధైర్యమే. తెలుగులో నాగార్జునగారు పరిచయం చేసిన 40వ డైరెక్టర్‌ సాల్మన్‌’’ అన్నారు నిరంజన్‌రెడ్డి. ‘‘వైల్డ్‌డాగ్‌’ సినిమాకు నాకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌. నాగార్జునగారితో వర్క్‌ చేయడంతో నా కల నిజమైనట్లుగా ఉంది’’ అన్నారు తమన్‌. 67వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినీపరిశ్రమలో అవార్డులు సాధించిన  ‘మహర్షి’ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి, కొరియోగ్రాఫర్‌ రాజుసుందరం, ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి, ఎడిటర్‌ నవీన్‌ నూలిలను ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రబృందం సన్మానించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement