ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్, బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్
‘‘సంక్రాంతి పండగకి విడుదలైన నా సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈ సంక్రాంతి కానుకగా రిలీజవుతున్న ‘డాకు మహారాజ్’ కూడా ఘన విజయం సాధిస్తుంది. ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఏం ఊహించుకుంటున్నారో అంతకు మించి ఈ సినిమా ఉంటుంది’’ అని బాలకృష్ణ చెప్పారు. బాబీ కొల్లి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ రేపు (ఆదివారం) విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘తిరుపతి తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’.. ఇలా వరుస ఘన విజయాల తర్వాత వస్తున్న ‘డాకు మహారాజ్’తో మరో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు. బాబీ కొల్లి మాట్లాడుతూ–‘‘నా టీమ్‌తో కలిసి ఎంతో శ్రద్ధగా ‘డాకు మహారాజ్’ కథని సిద్ధం చేశాను. బాలకృష్ణగారితో ఒకసారి పని చేస్తే మళ్లీ పని చేయాలనిపిస్తుంటుంది’’ అని చెప్పారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ఐదేళ్ల క్రితం వైకుంఠ ఏకాదశి రోజున ‘అల వైకుంఠపురములో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి, జనవరి 12న ఆదివారం సినిమా విడుదల చేశాం.
ఇప్పుడు ‘డాకు మహారాజ్’కి కూడా అదే జరిగింది. ‘అల వైకుంఠపురములో’లాగే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ప్రాణం పెట్టి సంగీతం చేయాలనిపిస్తుంది. అలాంటి సినిమా ‘డాకు మహారాజ్’’ అన్నారు. ఈ వేడుకలో వైజాగ్ ఎంపీ భరత్, బాలకృష్ణ కుమార్తె తేజస్విని, కెమెరామేన్ విజయ్ కన్నన్, రచయిత మోహన్ కృష్ణ తదితరులు పాల్గొని, ‘డాకు మహారాజ్’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment