తమిళసినిమా: కోలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ దర్శకుడు ఎవరంటే ఠక్కున వచ్చే బదులు లోకేష్ కనకరాజ్ అనే. ఈయన చేసింది ఇప్పటికి అక్షరాలా ఐదు చిత్రాలే. అయితే అన్నీ వసూళ్ల వర్షం కురిపించినవే. మా నగరంతో దర్శకుడిగా పరిచయం అయిన ఒక బ్యాంకు ఉద్యోగి లోకేష్ కనకరాజ్. ఈ చిత్రం విజయం సాధించడంతో ఖైదీ చిత్రాన్ని కార్తీ హీరోగా చేశారు. అదీ సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత విజయ్ కథానాయకుడిగా, విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా చేసిన మాస్టర్ చిత్రం వసూళ్లు కొల్లగొట్టింది. ఆ తరువాత కమలహాసన్ హీరోగా విక్రమ్ 2 చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నమోదైంది. ఇటీవల మరోసారి విజయ్ హీరోగా చేసిన లియో చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, వసూళ్ల విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇలా స్టెప్ బై స్టెప్ స్టార్ హీరోలతో పని చేస్తున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన 171 చిత్రాన్ని చేయడానికి సిద్ధం అయ్యారు.
ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా చిత్రంలో భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇంతకు ముందెప్పుడూ చూడని రజనీకాంత్‌ను ఈ చిత్రంలో చూస్తారని దర్శకుడు చెబుతున్నారు. చిత్ర టైటిల్‌ను ఏప్రిల్ 22వ తేదీన, షూటింగ్‌ను జూన్ నెలలో మొదలెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపోతే లోకేష్ కనకరాజ్ చాలా మంది దర్శకుల తరహాలో జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
ఈ బ్యానర్‌లో తన శిష్యులు, సన్నిహితులతో చిత్రాలు నిర్మిస్తానని చెప్పారు. ఆ విధంగా ఉరియడి చిత్రం ఫేమ్ విజయకుమార్ హీరోగా అబ్బాస్ ఏ.రఘుమాన్ దర్శకత్వం వహించిన ఫైట్ క్లబ్ చిత్రాన్ని గత ఏడాది చివరిలో విడుదల చేశారు. తాజాగా రత్నకుమార్ దర్శకత్వంలో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రత్నకుమార్ ఇంతకు ముందు మేయాదమాన్, ఆడై, కులు కలు వంటి చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం.
కాగా తాజా చిత్రంలో నటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నారు. ఇది హార్రర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ తరహా చిత్రాలే లారెన్స్‌ను హీరోగా నిలబెట్టాయన్నది తెలిసిందే. ఇకపోతే ఇందులో ప్రధాన పాత్రలో నటి నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్ర కథను దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాయడం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నయనతార నటుడు లారెన్స్ సరసన నటించడానికి ఒకే అంటారా? అన్న చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment