‘‘అంధాధున్’ కాస్త కల్ట్ సినిమా. తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నప్పుడు కొంచెం భయం వేసింది. ఈ సమయంలో అవసరమా? కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ పోవచ్చు కదా? అని. కానీ ఒక నటుడిగా రిస్క్ తీసుకోవాలి. ఇలాంటి ఆర్టిస్టిక్ సినిమా చేయాలని ఒప్పుకున్నా’’ అన్నారు నితిన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మాస్ట్రో’. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ మాట్లాడుతూ.. ‘‘అంధాధున్’ రీమేక్‌కి డైరెక్టర్ ఎవరు? అనుకుంటే మా అందరి ఛాయిస్ మేర్లపాక గాంధీ. ఒరిజినల్ సోల్ మిస్ కాకుండా హ్యమర్ యాడ్ చేసి బాగా తీశాడు. ‘అంధా ధున్’ ఎంత బాగుంటుందో ‘మాస్ట్రో’ కూడా అంతే బాగుంటుంది. హిందీలో నటీనటులే ‘అంధాధున్’ని ఒక లెవల్‌కి తీసుకెళ్లారు. మన తెలుగులో నేను, తమన్నా, నభాతో పాటు అందరం బాగా చేశాం. కొన్ని రిస్క్‌లు కూడా తీసుకున్నాం. ఈ సినిమాలో మంగ్లీతో యాక్టింగ్ చేయించడం ఒక డేరింగ్ స్టెప్’’ అన్నారు. చిత్రసమర్పకులు రాజ్‌కుమార్ ఆకెళ్ల మాట్లాడుతూ.. ‘‘అంధా ధున్’ ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి రీమేక్‌గా రుపొందిన ‘మాస్ట్రో’ చిత్రానికి నటీనటులను ఎంచుకోవడం పెద్ద ఛాలెంజ్.
నితిన్, తమన్నా, నభా నటేశ్, నరేశ్.. ఇలా అందరి పాత్రలు చాలా బాగుంటాయి. మేర్లపాక గాంధీ ప్యాషనేట్ డైరెక్టర్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిగార్లతో కలసి ఈ సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. నిఖితా రెడ్డి మాట్లాడుతూ..‘‘మేర్లపాక గాంధీ ఈ రీమేక్‌ని చాలా బాగా చేశారు. నితిన్, తమన్నా, నభా నటేశ్‌తో పాటు అందరూ వారి వారి పాత్రలకు సరిగ్గా సరిపోయారు’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ.. ‘అంధా ధున్’ లాంటి సినిమాకి భాష అవసరం లేదు. ఈ సినిమా తెలుగులో వస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనుకున్నాను. ఇప్పుడు వస్తోంది. లవ్‌స్టోరీ కాకుండా ఓ డిఫరెంట్ మూవీలో నితిన్‌తో కలిసి యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది. అంధుడిగా యాక్ట్ చేయడం చాలా కష్టం.
నితిన్ అలాంటి పాత్రకు ఓకే చెప్పి ధైర్యంగా ముందడుగు వేశారు. ఓ సక్సెస్‌ఫుల్ సినిమాను మేర్లపాక గాంధీగారు తనదైన స్టైల్లో తీశారు. ఆయన కష్టం ప్రేక్షకులకు నచ్చుతుందను కుంటున్నాను’’ అని అన్నారు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ‘‘నితిన్ అన్నతో ఓ కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ‘అంధాధున్’ లాంటి మంచి ఆర్టిస్టిక్ ఫిల్మ్‌ని తనతో చేయడం హ్యాపీ. ‘అంధా ధున్’కు, ‘మాస్ట్రో’కు పోలికలు పెట్టవద్దన్నా పెడతారు. నిందించడానికో లేదా అభినందించడానికో అయినా సరే.. సినిమా చూడండి’’ అన్నారు. ఈ వేడుకలో నభా నటేష్, వీకే నరేశ్, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్, పాటల రచయితలు కాసర్ల శ్యామ్, భాస్కర భట్ల, గాయని మంగ్లీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment