
Nora Fatehi Injured: పై ఫొటోలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ నుదుటన రక్తం కారుతోంది. ఇది మేకప్ మహిమ అనుకునేరు, కానే కాదు! "భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా" షూటింగ్‌లో జరిగిన గాయం తాలూకు గుర్తులివి. ఈ సినిమా షూటింగ్‌లో ఓ నటుడు గన్ వాడేటప్పుడు ప్రమాదవశాత్తూ అది నోరా ముఖానికి తగిలడంతో రక్తం కారింది. అయితే తన గాయాన్ని పంటి కింద భరిస్తూ కారుతున్న రక్తంతోనే షూటింగ్‌లో పాల్గొందట ఈ భామ. దీంతో ఆ సీన్ చాలా సహజంగా వచ్చిందట.
దీని గురించి నోరా మాట్లాడుతూ.. "భుజ్ సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నాం. ఓ వ్యక్తి నా నుదుటి మీద గన్ పెట్టగా అతడిని నేను ఎదురించాలి. రిహార్సల్స్ పూర్తి బాగానే చేశాం. కానీ తీరా దీన్ని షూట్ చేసేటప్పుడు ఆ మెటల్ గన్ నా ముఖానికి చాలా బలంగా తగలడంతో ఒక్కసారిగా రక్తం చిందింది. ఆ తర్వాతి రోజు మరో యాక్షన్ సీన్‌లోనూ కాలికి గాయమైంది. ఈ దెబ్బల తాలూకు మచ్చలతోనే అన్ని సీన్లలో నటించాను. డూప్ లేకుండా గాయాలతోనే యాక్షన్ సన్నివేశాలు పూర్తి చేయడం నా జీవితంలో మర్చిపోలేను" అని చెప్పుకొచ్చింది. కాగా అజయ్ దేవ్‌గణ్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'భుజ్' ఆగస్టు 13న హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతోంది.