సాక్షి, ముంబై: బాలీవుడ్‌కే కాకుండా యావత్ సినీ ప్రపంచానికి దార్శనికుడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. 1982వ సంవత్సరంలో కూలీ షూటింగ్‌లో ఆయన తీవ్రంగా గాయపడి కొన్ని రోజుల పాటు ఆసుపత్రిపాలయ్యాడు. అప్పుడు ఆయన కోలుకోవాలంటూ దేశమంతా పూజలు చేసి ప్రార్థించింది. అందరి ప్రార్థనలు ఫలించి చావు బతుకుల మధ్య ఉన్న ఆయన తిరిగి కోలుకోగలిగాడు. పెద్ద గండం గట్టెక్కిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా ముప్పై రెండు సంవత్సరాల తర్వాత అంటే ఈ ఏడాదిలో ఆయనకు ప్రాణాంతక కోవిడ్ సోకింది. జూలై 11న ఈ వార్త తెలియగానే అందరూ మరోసారి ఉలిక్కిపడ్డారు. అయితే బిగ్‌బీ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పినప్పటికీ కోవిడ్‌ను నమ్మడానికి లేదు. దీంతో మరోసారి అభిమానులు అమితాబ్ కోలుకోవాలంటూ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. (ఆ వార్తలో నిజం లేదు: అమితాబ్ బచ్చన్)
అమితాబ్ కరోనాతో చనిపోనూ!
కానీ ఇదే సమయంలో ఎన్నడూ లేనంతగా ఆయనపై విషం చిమ్ముతున్నారు. కోవిడ్‌తోనే ప్రాణాలు వదిలేయమంటూ అమితాబ్‌కు శాపనార్థాలు పెడుతున్నారు. కోట్లాది మందికి ఆదర్శప్రాయుడైన ఆయనపై ఎందుకీ కక్ష? 77 ఏళ్ల వయసులో కొత్తగా ఈ శాపనార్థాలు పెట్టడానికి కారణం ఏంటి? ఏమీ లేదు, పక్కవాడి జీవితం నాశనం అవాలని కోరుకోవడం, ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వలేకపోవడం! బహుశా 1982లోనూ ఇలాంటి దురాలోచనలు ఉండేవేమో, కానీ వ్యక్తి చనిపోవాలని కోరుకునేంతగా కాదు. ఇప్పుడు ఆ ఆలోచనలకు విషం అద్దుతూ సోషల్ మీడియాను వాడుకుంటూ నేరుగా ముఖంపైనే అనేస్తున్నారు. కసి తీరా ఎదుటివారి మనోభావాలను, మనోబలాన్ని కుళ్లబొడుస్తూ రాక్షసానందం పొందుతున్నారు. (కంగనా వ్యాఖ్యలపై స్పందించిన తాప్సీ)
వాడిని వదిలేయండి
ఇలానే ఓ వ్యక్తి అమితాబ్‌ను కరోనాతో చావాలని కోరుకున్నాడు. వయసులోనే కాక వ్యక్తిత్వంలోనూ పెద్దవాడయిన బిగ్‌బీ తన సహనాన్ని కోల్పోయారు. "ఓ అనామకుడా.. దేవుని దయ వల్ల నేను బతికితే నా 9 కోట్ల మంది ఫాలోవర్ల ప్రేమతో నువ్వు తుడిచి పెట్టుకుపోతావు. నీ గురించి వారికింకా చెప్పలేదు" అని ఆగ్రహిస్తూనే, "వదిలేయండి వాడిని" అని అసహనం వ్యక్తం చేశారు. అమితాబ్ ఒక్కరే కాదు.. ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడుతున్నారు. దీంతో వారికి సోషల్ మీడియాను వాడాలంటేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో వేధింపులకు దూరంగా ఉండేందుకు బ్రిటీష్ స్టార్‌స్టీఫెన్ ఫ్రై ట్విటర్ నుంచి నిష్క్రమించారు. సోనాక్షి సిన్హ కూడా సోషల్ మీడియాను దూరం పెట్టారు. (ఓ అనామకుడా.. నీపై జాలి వేస్తోంది)
ఎందుకీ ట్రోలింగ్?
ఒకరి ప్రతిష్టను దెబ్బతీసేందుకు, వారిని కిందకు దిగజార్చడానికి, ఉద్దేశపూర్వకంగా దాడి చేయడానికి ట్రోల్స్‌ను ఆయుధంగా వాడుతున్నారు. ముఖ్యంగా నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ, బెదిరింపులకు దిగుతుంటారు. మన దేశంలోనూ సుశాంత్ ఆత్మహత్య తర్వాత సెలబ్రిటీలపై వేధింపులు, దూషణలు తీవ్రరూపం దాల్చాయి. దీన్ని నివారించడం ట్విటర్ యాజమాన్యానికి కూడా తలకు మించిన భారంగా తయారైంది. నీచంగా కామెంట్లు పెడుతూ, వ్యక్తిగతంగా దూషించినవారి అకౌంట్లను తొలగించినప్పటికీ వారు వెంటనే మరో కొత్త అకౌంట్ తెరిచి యథావిధిగా దాడికి దిగుతూనే ఉన్నారు. వీటి నుంచి కాపాడుకోవాలంటే ఒకటే మార్గం. 'అయితే వారిని బ్లాక్ చేయాలి లేదా తిరిగి పోరాడాలి'. కానీ కొన్నిసార్లు ఈ రెండు పద్ధతులు కూడా సరిపోకపోవచ్చు.
ఒక్కమాటలో అమితాబ్ డైలాగ్ ప్రకారం చెప్పాలంటే.. పక్కోడి జీవితం మీద పడి ఏడ్చేవాడికి ఈ భూమిపై బతకాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment