‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ నిడివి 39 నిమిషాలు. రెండు ఏనుగు పిల్లలు, నీలగరి అడవుల్లో ఉండే ‘కట్టు నాయకర్’ అనే తెగకు చెందిన ఆదివాసీ భార్యాభర్తలు ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తారు. ఆ భార్యాభర్తల పేర్లు బొమ్మన్, బెల్లి. ఏనుగు పిల్లల్లో ఒకదాని పేరు రఘు, మరోదాని పేరు అమ్ము. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. అయితే డాక్యుమెంటరీలో ఎక్కువ భాగం రఘతో బొమ్మన్, బెల్లిలకు ఉండే అనుబంధం చూపుతుంది. అయితే నేపథ్యంలో అందమైన అడవులు, వాగులు, ఆదివాసీల క్రతువులు ఇవన్నీ దర్శకురాలు కార్తికి చూపడంతో డాక్యుమెంటరీకి ఒక సంపూర్ణత్వం వచ్చింది. బొమ్మన్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి. ఇప్పుడు రఘు, అమ్ములను అటవీ శాఖ వారు ‘ముడుమలై టైగర్ రిజర్వ్’కు మార్చారు. దాంతో రఘుతో ఆ దంపతుల బంధం తెగింది.
విఘ్నాలు తొలగిపోయాయి. పూర్తిగా ఇండియాలో నిర్మితమైన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్ అందింది. ఇది స్త్రీల ద్వారా జరిగింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది కార్తికి గోంజాల్వేజ్. నిర్మించింది గునీత్ మోంగా. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు అనే అనాథ ఏనుగు పిల్ల. ఆ ఏనుగు పిల్లను సాకిన ఆదివాసి దంపతులు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధం ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా వ్యక్తమైంది. అందుకే అంబారీ ఎక్కి వచ్చినట్టుగా మనకు ఆస్కార్ ఘనంగా దక్కింది.
ఏనుగులు– మావటీలు మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నారు. కాని వారి మధ్య ఉన్నది ఒక రకమైన ప్రొఫెషనల్ స్నేహం. కాని కొన్ని సందర్భాలలో అనాథలైన ఏనుగు పిల్లలను కాపాడే పని ఆదివాసీలు తీసుకుంటారు. వారిది పెంచిన మమకారం. ఆ మమకారమే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కథాంశం. దర్శకురాలు కార్తికీది ఊటి. అక్కడే పుట్టి పెరిగింది. ఊటీకి అరగంట ప్రయాణ దూరంలో ‘తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్’ ఉంది. అక్కడ ఏనుగులను సంరక్షిస్తుంటారు. కార్తికి గోంజాల్వేజ్ చిన్నప్పటి నుంచి ఆ క్యాంప్‌కు వెళ్లి ఏనుగులను చూసేది. ఆ తర్వాత ఆమె పెరిగి పెద్దదయ్యి ఫొటోగ్రాఫర్‌గా మారినా, కెమెరా ఉమన్‌గా తనకున్న వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఇష్టం వల్ల యానిమల్ ప్లానెట్, డిస్కవరీ చానల్స్‌లో పని చేసినా ఎప్పుడూ తన ప్రాంత ఏనుగుల మీద ఏదైనా ఫిల్మ్ చేయాలని అనిపించలేదు. కాని 2017లో అందుకు బీజం పడింది.
అతడు – ఆ ఏనుగు పిల్ల
కార్తికి గోంజాల్వేజ్ 2017లో బెంగళూరు నుంచి కారులో ఊటీకి వెళుతోంది. ఊటీ చేరుకుంటూ ఉండగా ఒక మనిషి చిన్న ఏనుగు పిల్లను నడిపించుకుంటూ వెళుతూ ఆమె కంట పడ్డాడు. కార్తికి వెంటనే కారు ఆపి ఈ మనిషి ఈ ఏనుగు పిల్లను ఎక్కడకు తీసుకువెళుతున్నాడు అని వెంబడించింది. వారిద్దరూ దగ్గరిలోని ఏటికి వెళ్లారు. ఆ మనిషి ఆ ఏనుగు పిల్లకు చంటిపిల్లలకు మల్లే స్నానం చేయించాడు. దానితో ఎన్నో కబుర్లు చెప్పాడు. ‘అరె.. ఈ బంధం భలే ఉందే’ అనిపించింది కార్తికికి. అతణ్ణి పలకరించింది. పేరు బొమ్మన్. ఆ ఏనుగు పిల్ల పేరు రఘు. ఆ ఏనుగు పిల్ల ఇటీవలే అనాథ అయ్యింది. పంటలను కాపాడుకోవడానికి పెట్టిన కరెంటు తీగల బారిన పడి రఘు తల్లి మరణించింది. అనాథ అయిన రఘు తల్లి వియోగంతో కృశించి చావుకు దగ్గరగా ఉండగా బొమ్మన్‌కు కనిపించాడు. దానిని ఇంటికి తీసుకెళ్లాడు. బొమ్మన్ భార్య బెల్లి రఘుకు తల్లిలా మారింది. ఆ ముగ్గురు ఒక కుటుంబం అయ్యారు.
ఇలాంటి అనుబంధాలు చూపితే మనిషి, జంతువు కలిసి మెలిసి మనుగడ సాగించాల్సిన అవసరాన్ని చూపినట్టు అవుతుందని కార్తికి అనుకుంది. వెంటనే డాక్యుమెంటరీ నిర్మించడానికి నెట్‌ఫ్లిక్స్‌ను సంప్రదించింది. నెట్‌ఫ్లిక్స్ తన కో ప్రొడ్యూసర్‌గా నిర్మాత మోంగాను సంప్రదించింది. అలా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ నిర్మాణం మొదలైంది.
ఢిల్లీకి చెందిన గునీత్ దాదాపు పదేళ్లుగా అంతర్జాతీయ దృష్టి పడే సినిమాల నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. ఆమె నిర్మాణ భాగస్వామి అయిన ‘కవి’ (2010) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్‌లో ఆస్కార్ నామినేషన్ పొందగా, ‘పిరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ (2018) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌గా ఆస్కార్ అవార్డ్ పొందింది. అయితే ‘పిరియడ్’కు పని చేసిన సాంకేతిక నిపుణులు భారతీయులు కారు. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ను తీయాలనుకుంటున్న కార్తికితో పని చేయడం వల్ల ఈసారి పూర్తి భారతీయ నిర్మాణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని గునీత్ భావించింది. అలా వీరిద్దరు కలిసి పూర్తి చేసిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 8, 2022న విడుదలైంది.
ఇది డాక్యుమెంటరీ వేవ్
‘ఇప్పుడు ఇండియాలో నడుస్తున్నది డాక్యుమెంటరీ వేవ్. ఫీచర్ ఫిల్మ్స్‌లో కన్నా డాక్యుమెంటరీలో భారతీయ దర్శక నిర్మాతలు వినూత్నమైన కథాంశాలను చెబుతున్నారు’ అంటుంది గునీత్. కార్తికి మాట్లాడుతూ– ‘ఏనుగులు ఎంత తెలివైనవో ఎంత భావోద్వేగంతో బంధంతో ఉంటాయో నా డాక్యుమెంటరీలో చూపించాను. ఇక మీదటైనా అవి వేరు మనం వేరు అనుకోకపోతే చాలు’ అంది. ‘నేను తీసే ఫిల్మ్స్ ఇకపై కూడా ఇలాంటి కథాంశాలతో ఉంటాయి’ అన్నారు.
చదవండి: ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ
Comments
Please login to add a commentAdd a comment