‘పిల్ల పిలగాడు' వెబ్ సిరీస్ ఫేమ్ సాయి తేజ హీరోగా నటించిన చిత్రం ‘పైలం పిలగా’. పుష్ప , పరేషాన్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పావని కరణం హీరోయిన్‌గా నటించింది. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
తెలంగాణలోని కోతులగుట్ట గ్రామానికి చెందిన శివ(సాయి తేజ) డిగ్రీ చదివి ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాలీగా ఉంటాడు. ఊర్లో ఏ పని చేసినా గుర్తుంపు ఉండదని, దుబాయ్‌కి వెళ్లి బాగా సెటిల్ అవ్వాలనుకుంటాడు. పాస్‌పోర్ట్, ఉద్యోగం కోసం రూ. 2 లక్షలు కావాల్సి వస్తుంది. దాని కోసం శివ తన నానమ్మ పేరుపై ఉన్న స్థలాన్ని అమ్మాలనుకుంటాడు. తన స్నేహితుడు శ్రీను(ప్రణవ్ సోను)తో కలిసి స్థలం అమ్మేందుకు వెళ్తాడు.
అయితే ఆ స్థలం లిటికేషన్‌లో ఉంటుంది. పంచాయితీ తర్వాత గుట్టగా మారిన రెండెకరాల స్థలం అతనికి వస్తుంది. అది అమ్మకానికి పెడితే ఎవరూ కొనేందుకు ముందుకు రారు. కానీ మరుసటి రోజు 10 లక్షలు ఇస్తానని ఒకరు.. 30 లక్షలు ఇస్తానని మరొకరు.. రూ. కోటి ఇస్తా ఆ స్థలం నాకే అమ్ము అని ఇంకొకరు శివ దగ్గరకు వచ్చి బ్రతిమిలాడుతుంటారు. పనికి రాని ఆ గుట్టను కొనేందుకు వాళ్లంతా ఎందుకు ఆసక్తి చూపారు? దుబాయ్ వెళ్లాలనుకున్న శివ కోరిక నెరవేరిందా? దేవి(పావని కరణం)తో శివ ప్రేమయాణం ఎలా సాగింది? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
హాస్యం ప్రధానంగా సాగే వ్యంగ్య చిత్రమిది. కథంతా తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. తెలంగాణలో పైలం అంటే జాగ్రత్త అని అర్థం. ఆ టైటిల్‌కి తగ్గటే హీరో వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు. దుబాయ్‌కి వెళ్తే భారీగా డబ్బు సంపాదించొచ్చనే ఆశతో సొంత భూమిని అమ్మాలనుకుంటాడు. అయితే ఆ భూమికి విలువ రావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆసక్తికరమైన అంశం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలనే కథగా మలచుకొని దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.
కథనాన్ని కామెడీగా సాగిస్తూనే ఓ మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రతి రోజు టీ షాపు దగ్గర ఎదురు చూడడం.. తన ప్రేమ విషయం తెలియజేయడానికి హీరో పడే పాట్లు నవ్విస్తాయి. అలాగే దుబాయ్ వెళ్లేందుకు హీరో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. స్థలం అమ్మకానికి పెట్టేవరకు కథంతా సోసోగా సాగుతుంది. అయితే స్థలం కొనడానికి చాలా మంది ఆసక్తి చూపడం.. కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడంతో కథపై ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం కొంత సాగదీతగా ఉంటుంది. క్లైమాక్స్ పర్వాలేదు. ఎలాంటి వల్గారిటీ లేకుండా హాస్యభరితంగా కథనం సాగడం ప్లస్ పాయింట్. నిడివి కూడా తక్కువే ఉండడం సినిమాకు కలిసొచ్చే అంశం.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. పల్లెటూరి యువకుడు శివగా సాయితేజ తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రకృతిని ప్రేమించే పల్లెటూరి అమ్మాయి దేవి పాత్రకి పావని న్యాయం చేసింది. హీరో స్నేహితుడి నటించిన వ్యక్తి కామెడీ పంచులు నవ్వులు పూయించాయి. హీరో నానామ్మగా డబ్బింగ్ జానకి ఓ డిఫరెంట్ పాత్రలో మెరిసింది. చిత్రం శీను, మిర్చి కిరణ్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment