Pendyala Nageswara Rao: నాన్న చెబితే అదే ఫైనల్‌... | Pendyala Nageswara Rao Songs, Music, Family Members, Unknown Facts | Sakshi
Sakshi News home page

Pendyala Nageswara Rao: నాన్న మూర్తీభవించిన సంగీతం..

Published Wed, May 12 2021 8:02 PM | Last Updated on Wed, May 12 2021 9:00 PM

Pendyala Nageswara Rao Songs, Music, Family Members, Unknown Facts - Sakshi

శివశంకరీ శివానందలహరీ... రసికరాజ తగువారముకామా...
మది శారదా దేవి మందిరమే... శేషశైలావాసా శ్రీవెంకటేశా...
చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది... నీలిమేఘాలలో గాలి కెరటాలలో... 
కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది.. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు... 
ఒకటనేమిటి... వేల పాటలు నేటికీ తెలుగు వారి గుండెలను పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి.. 
ఆనందంతో గుండె తడి చేసున్నాయి...
పాటలకు జీవం కలిగించేలా సంగీతాన్ని అందించారు పెండ్యాల నాగేశ్వరరావు.. 
కుటుంబంలో పిల్లలతో అతి సామాన్యుడిలా ఉండేవారు అంటున్నారు
పెండ్యాల రెండవ కుమార్తె డాక్టర్‌ సుజాత

నాన్నగారు గుంటూరు జిల్లా వణుకూరులో 1917లో పుట్టారు. సీతారామయ్య, వెంకమ్మ తల్లిదండ్రులు. నాన్నగారి ఆరు నెలల వయసులోనే వారి తల్లిగారు స్వర్గస్థులయ్యారు. తాతగారు రెండో వివాహం చేసుకున్నారు. ఆవిడ నాన్నగారిని సవతి కొడుకులాగే చూశారు. తాతగారి దగ్గరే సంగీతంలో ఓనమాలు దిద్దారు. నాన్న ఏడో తరగతి చదువుతుండగా డబుల్‌ ప్రమోషన్‌ వచ్చింది. తాతగారిని జీతం కట్టమని అడిగితే, ఆయన కట్టలేదు. అందువల్ల నాన్న పెద్దగా చదువుకోలేకపోయారు. నాన్నగారి నాయనమ్మ సుబ్బమ్మగారే నాన్నను పెంచి, పెద్ద చేశారు. ఆవిడనే ‘అమ్మా!’ అని పిలిచేవారు. ఆవిడే సీత అనే అమ్మాయితో నాన్న వివాహం జరిపించారు.

ఒక ఆడపిల్ల పుట్టేవరకు నాయనమ్మ జీవించి ఉన్నారు. కన్నతల్లిని చూడలేకపోయారన్న బాధ నాన్నను జీవితాంతం వెంటాడింది. మాతో ‘అమ్మా! మీరు అదృష్టవంతులు, తల్లి ప్రేమకు నోచుకున్నారు’ అనేవారు. నాన్న స్వరపరచిన ‘చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది’ పాట నాన్న గుండె లోతుల్లో నుంచి వచ్చింది. తనను సవతి తల్లి సరిగా చూడకపోయినా, ఆవిడ పిల్లల్ని తన సొంత తమ్ముళ్లు, చెల్లెళ్లుగానే చూసుకున్నారు నాన్న. తెల్లటి బెంగాలీ పంచె కట్టుతో, తెల్లటి గ్లాస్కో జుబ్బాకి బంగారు గుండీలతో ఉండే వస్త్రాలలో నాన్న స్వచ్ఛంగా కనిపిస్తారు. 


బాగా చదివించారు..
నాన్నగారికి మేం నలుగురు ఆడపిల్లలం. నిర్మల, సుజాత, వనజ, మంజుల. ‘అయ్యో! నలుగురు ఆడపిల్లలు’ అనే భావన ఉండేది కాదు. సంగీతంలో ఎత్తుకి ఎదగలేమనుకున్నారో ఏమో, మమ్మల్ని బాగా చదివించారు. నాన్న మాతో అన్ని విషయాలూ స్నేహంగా చర్చించేవారు. ఒకసారి నాతో, ‘అమ్మాయీ! తలకాయ అటుఇటు కదుపుతుంటే నీళ్ల చప్పుడు వస్తోంది. తలలో నీళ్లున్నట్లున్నాయి’ అన్నారు. ‘ఏమీ లేదు నాన్నా’ అంటే, ‘అంతేనంటావా’ అన్నారు. ఆయన గొంతులో పలికే మాటలో మాధుర్యం, చేతిరాతలో అందం ఉంటాయి.

అరటి ఆకుల్లో భోజనం
మాది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఇంట్లో చాలా సంవత్సరాల వరకు భోజనాల బల్ల కూడా లేదు. అమ్మ మడి కట్టుకుని వంట చేసి, అరటి ఆకులు వేసి వడ్డిస్తుంటే, అందరూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేసేవారు. నాన్న సినిమా రంగంలో ఉండటం వల్ల, మా మావయ్య, బాబయ్యలు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించటానికి మా ఇంటికి వస్తుండేవారు.

నాన్నగారు ఏం చేసేవారు...
నాన్న సినిమాలలో బిజీగా ఉన్న రోజుల్లో మూడు షిఫ్టులు పనిచేసేవారు. పొద్దున్న ఎనిమిదికి వెళితే, ఇంటికి వచ్చేసరికి రాత్రి రెండయ్యేది. ఈ సందర్భంగా నాన్న చెప్పిన ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. ‘అనురాగము విరిసేనా’ పాట చేస్తున్నప్పుడు, ఆఫీసు పక్కింటివారు ఆ పాట వినటం కోసం పనులన్నీ మానుకుని కూర్చునేవారట. 

ప్రతీ పాటా ఓ పరీక్షే
నాన్న ప్రతి పాటను ఒక పరీక్షగా భావించేవారు. పాట రికార్డింగ్‌ అయ్యాక, ఆఫీస్‌ బాయ్‌ సైతం ‘బావుంది’ అన్న తరవాతే ఓకే చేసేవారు. ఓకే చేశాక కూడా ఎక్కడైనా తనకు నచ్చలేదనిపిస్తే, మరుసటి రోజు మళ్లీ మార్చేవారు. ఎన్ని రీరికార్డింగులు చేసినా ఇరిటేట్‌ అయ్యేవారు కాదు. కొన్ని పాటలు స్వరపరుస్తున్నప్పుడు ‘అసలు ఈ పాట అందరూ వింటారా?’ అనుకునేవారు. ‘మీరజాలగలడా నాయానతి...’ పాట ప్రేక్షకులకు నచ్చిందో లేదో తెలుసుకోవాలని, ఆంధ్రలో సినిమా థియేటర్‌లో ప్రేక్షకుల మధ్యన కూర్చుని గమనించారట. వారంతా సంతోషంతో తలలాడిస్తుంటే, ‘నా పాటలు నిలిచిపోతాయి’ అని తృప్తి పడ్డారట. నాన్న ఒకసారి ఒక పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ ‘శివశంకరి..’ పాట వస్తుంటే, వింటూ తాళం వేస్తున్నారట. నాన్న వెనకాల కూర్చున్న ఒకాయన, ‘ఆయనను చూడండి ఏదో పెద్ద సంగీతం విద్వాంసుడిలా తాళం వేస్తున్నారు’ అంటే అప్పుడు అక్కడ మరో పెద్దాయన ‘ఆయనే పెండ్యాలగారు’ అన్నారట. ఆ అంశం ఒక పత్రికలో ప్రచురిస్తే, అది నాన్న భద్రంగా దాచుకున్నారు. 

నాన్న చెబితే అదే ఫైనల్‌...
కాలేజీల వారు నాన్నను జడ్జిగా పిలిచేవారు.  సినిమాలో అవకాశం కోసం చిన్న, పెద్ద తేడా లేకుండా పాడుతుంటే విని, ‘బాగా పాడారు కానీ మీ ఊరు వెళ్లిపోండి’ అనేవారు. ‘బాగా పాడారు’ అనేది వారిని తృప్తి పరచడానికి, ‘వెళ్లిపో’మనటం వాళ్ల శ్రేయస్సు కోరి. సినిమా సంగీతానికి ఏ గొంతు ఎలా ఉంటే బావుంటుందో నాన్నకు బాగా తెలుసు. ‘పెండ్యాలగారు మెచ్చుకున్నారంటే, వాళ్లు అదృష్టవంతులు’ అనుకునేవారు. ఘంటసాల గారి గొంతును ‘పెండ్యాల గారు అర్థం చేసుకున్నట్లుగా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు’ అన్నారు కొందరు విమర్శకులు. పి. సుశీల, ఎస్‌. జానకి వంటి ఎంతో మంది గాయకులను నాన్నగారే సినిమా పరిశ్రమ కు పరిచయం చేశారు. నాన్న వ్యక్తిత్వం ఎవరెస్ట్‌ కంటె గొప్పది. 

ఎంత ఇష్టమో..
‘పెండ్యాల గారు ఈ పాట పాడండి’ అని బంధువులు అడిగిన పాటను ఎంతో పరవశంతో పాడేవారు. ఆయనకు నచ్చిన ప్రేక్షకులు వారే.  నాన్న మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ‘ఒక్క పాట పాడు నాన్నా’ అని మేం అడిగితే ‘జ్ఞాపకం లేదమ్మా’ అనేవారు. ‘మేం అందిస్తాం నాన్నా’ అంటే పాడేవారు. నాన్న చాలా గుప్తదానాలు చేశారు. ఆకలితో ఉన్నవారికి జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చేసేవారు. ఒకసారి ఒక కుర్రవాడికి పావలా ఇచ్చారటం. ఆ రోజుల్లో కానీలు ఉండేవి. అది చూసిన మా బాబయ్య (నాన్న సవతి తమ్ముడు), అన్నయ్య దేవుడు అని మాతోత చాలా సార్లు చెప్పాడు. సినీ మ్యుజీషియన్స్‌ అసోసియేషన్‌ కోసం నాన్న చేసిన కృషి ఫలితంగా ఇప్పుడు చాలామందికి పెన్షన్లు వస్తున్నాయి. 

ఆరాధ్య దైవం శ్రీనివాసుడు..
నాన్నకు దైవభక్తి ఎక్కువ. ‘వేంకటేశాయ నమః’ అంటూ పూలతో ఆత్మార్పణం చేసేవారు. ఆయన ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి. వారానికోసారి తిరుపతి వెళ్లేవాళ్లం. నాన్న తిరుమలలో చేయించని సేవ లేదు. వెంకటేశ్వర స్వామి మీద స్వరపరిచిన పాటలు భక్తిలో లీనమై చేశారు. ‘శేష శైలావాసా శ్రీవెంకటేశా’ పాటను అందరూ ఇప్పటికీ కీర్తన అనుకుంటారు. నాకు నాన్న స్వరపరిచి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు పాడిన ‘ఏటిలోని కెరటాలు..’ పాట చాలా ఇష్టం.

ఒకే టేక్‌లో శివశంకరి...
వేటూరి గారు విజయవాడ ఆకాశవాణి వారి కోసం రచించిన ‘సిరికాకొలను చిన్నది’ రూపకాన్ని నాన్న స్వరపరిచారు. నాలుగైదు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు వేశారు. జగేదకవీరుని కథ చిత్రంలోని ‘శివశంకరి..’ పాటను ఘంటసాల గారితో బాగా ప్రాక్టీస్‌ చేయించి, ఒకే టేక్‌లో ఓకే చేశారు. విజయానంద చంద్రిక అనే కొత్త రాగాన్ని కనిపెట్టి, ‘జయభేరి’ చిత్రంలో ‘రసికరాజ తగువారము కామా’ పాటలో ఆ రాగం వాడారట. ‘శ్రీఘంటసాల పంచరత్నములు’ పేరుతో వెలువడిన ఐదు పాటలలో, నాన్నగారు స్వరపరిచిన ‘మది శారదా దేవి’, ‘శివశంకరీ’, ‘ముక్కోటి దేవతలు..’ పాటలు ఉన్నాయి. పెద్దలంతా నాన్నను మాస్టారూ అంటే, నాన్న ఘంటసాల గారిని ‘మాస్టారూ’ అనేవారు.

కాంబినేషన్స్‌  వంట చేసేది...
అమ్మనాన్నలది అన్యోన్య దాంపత్యం. ప్రేమ, ఆప్యాయతలను అర్థం చేసుకోవటమే దాంపత్యం అని వారిని చూస్తే అర్థమవుతుంది. భోజనం చేసేటప్పుడు, అమ్మ మారు వడ్డింపు అడిగితే, ‘వద్దు’ అని నాన్న అంటే, ‘ఏం వంట బాలేదా’ అని అడిగేది. ‘సీతమ్మా ఈ రోజు వంట బాగుంది’ అని నాన్న అంటే అమ్మ ఆనందపడేది. నాన్నకి కాంబినేషన్స్‌తో వంట చేసేది. తోటకూర – మజ్జిగ పులుసు, కంది పచ్చడి – పచ్చి పులుసు, కొబ్బరి కాయ – మామిడి కాయ పచ్చడి, గారెలు – అల్లం పచ్చడి. నాన్నకి అల్లం గారెల పచ్చడి ఇష్టం. ఆయన ఎన్ని తినగలరో అమ్మకి మాత్రమే తెలుసు.  

గణపతిం భజే...
1976 డిసెంబర్‌లో గుంటూరులో పెద్ద సన్మానం చేశారు. సకల గాయక సంగీత విభావరి పేరున సినీ కళాకారులు నాన్నగారి సమక్షంలో పాడారు. నాన్నకు ‘సంగీత సామ్రాట్‌’ బిరుదు ఇచ్చారు. వైజాగ్‌లో 1983లో పూర్ణకుంభం, వేదమంత్రాలతో, రోజా పూల బాట లో నడిపించి, సన్మానం చేశారు. ‘నన్ను దేవుణ్ని చేసేశారు’ అని నాన్న చెప్పారు. వాళ్లు దేవుణ్ని చేశారో, నాన్నే దేవుడు అయ్యారో తెలియదు కానీ, అది జరిగిన కొద్ది కాలానికే నాన్న కన్నుమూశారు. ఆ రోజు వినాయక చవితి. అమ్మ ఉండ్రాళ్లు, అల్లం పచ్చడి చేసింది. నేను మా వారు మధ్యాహ్నం ఇంటికి వెళ్లేసరికి నాన్న భోజనం చేసి, పడక్కుర్చీలో కూర్చుని ఆయాసపడుతున్నారు. హాస్పిటల్‌కి చేరుకునేసరికే కార్డియాక్‌ అరెస్ట్‌తో అంతా అయిపోయింది. అన్ని ఊళ్లలో ఈ వార్తను కరపత్రాలు గా పంచారు.  ‘వాతాపి గణపతిం భజే’ అని సంగీతాన్ని ప్రారంభించిన నాన్నగారు ఆ గణపతి పుట్టినరోజు నాడే ఆయనలో ఐక్యమైపోయారు. 
- సంభాషణ: వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement