ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ మృతి కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం, ఆధారాలు తెలిసిన వారు ఎవరైనా తమకు ఆ వివరాలు అందచేయాలని పోలీసులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ (28) జూన్ 8న ముంబైలోని మలద్ ప్రాంతంలో బహుళఅంతస్తుల భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మల్వాని పోలీసులు దిశ మృతిపై యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్‌ను నమోదు చేసిన మల్వానీ పోలీసులు దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. దిశ మరణంపై సోషల్ మీడియా, వార్తాపత్రికలు, టీవీ చానెళ్లలో పలు కథనాలు వెల్లడవడంతో ఈ కేసులో మరింత సమాచారం కోసం ఈ కథనాలను పరిశీలిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.
ఈ కేసును నిగ్గుతేల్చేందుకు ఉపకరించే ఏ సమాచారమైనా ప్రజలు తమతో పంచుకోవచ్చని తెలిపారు. మరోవైపు దిశ సలియాన్ ఆత్మహత్య చేసుకోలేదని ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాల మరకలున్నాయని పోస్ట్‌మార్టం నివేదికలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక జూన్ 14న బాంద్రా నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ రాజ్‌పుత్ మరణం కలకలం రేపుతోంది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణకు బిహార్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మరోవైపు సుశాంత్ మరణంపై దర్యాప్తు చేపట్టేందుకు ముంబై చేరుకున్న తమ పోలీసులు దిశ మృతిపై కూడా విచారణ చేపడతాయని బిహార్‌కు చెందిన సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment