
ఈ రోజుల్లో అప్పు చేయని వాళ్ళు చాలా తక్కువ. మరీ మధ్యతరగతి వాళ్ళు అవసరాల కోసం అప్పులకై తిప్పలు పడతారు. ఒకవేళ అప్పు దొరికినా దానిని తీర్చడం మరో ఎత్తు. ఈ కసరత్తు మీదనే పొన్ మాన్(ponman Movie) సినిమా రూపుదిద్దుకుంది. ఇదో మళయాళ సినిమా. జియో హాట్ స్టార్ వేదికగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యమవుతుంది. జ్యోతిష్ శంకర్ దీనికి దర్శకత్వం వహించారు. ప్రముఖ మళయాళ నటుడు బసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఓ ఫ్యామిలీ డ్రామా. కాని జీవితంలో నగదు లేదా డబ్బు రూపేణా అప్పు చేసిన ప్రతివారు చూడవలసిన సినిమా.
అలా అని ఇదేదో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు, ఓ ఫ్యామిలీ థ్రిల్లింగ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇక పొన్ మాన్ కథ విషయానికొస్తే కేరళ రాష్ట్రంలోని తీర ప్రాంతమైన కొల్లాంలో బ్రూనో అనే వ్యక్తి తో ఈ కథ మొదలవుతుంది. చెల్లెలు స్టెఫీ, తల్లితో పాటు ఓ చిన్న కుటుంబం బ్రూనోది. సంపాదన లేకున్నా రాజకీయలపై ఇష్టంతో ఓ పార్టీలో చేరతాడు బ్రూనో. తన నోటి దురుసుతనం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ కూడా అవుతాడు. బ్రూనో తల్లి స్టెఫీకి త్వరగా పెళ్ళి చేయాలన్న తాపత్రయంలో పక్క ఊరిలోని మరియానోతో 25 సవర్ల బంగారం కట్నకానుకాలు ఇచ్చే విధంగా సంబంధం కుదురుస్తుంది.
దానికి గాను అజేష్ అనే బంగారు బ్రోకర్ ను సంప్రదించి పెళ్ళికి ముందు బంగారం తీసుకుని పెళ్ళిలో వచ్చే చదివింపులతో తిరిగి నగదు రూపేణా అప్పు తీర్చేవిధంగా ఏర్పాటు చేస్తుంది. అజేష్ ఇచ్చిన నగలతో స్టెఫీ, మరియానో పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాని అనుకోకుండా అంత డబ్బులు రావు. దీనితో అజేష్ తానిచ్చిన బంగారం కోసం పెళ్ళి వారితో పాటు స్టెఫీ అత్తగారింటికి వెళతాడు.
స్టెఫీ మరియానో కరుడుగట్టిన రౌడీ. స్టెఫీ వేసుకున్న బంగారం అప్పుకు తెచ్చిందన్న విషయం అత్తవారింట్లో ఎవరికీ తెలియదు. ఈ సమయంలో అజేష్ తన బంగారం స్టెఫీ నుండి తీసుకోగలడా లేదా అన్నది మాత్రం పొన్ మాన్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం థ్రిల్లర్ జోనర్ తో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తుంది. అప్పు తీసుకునే ప్రతి వాళ్ళూ తీసుకునేటపుడు బరువుగాను తిరిగి ఇచ్చేటపుడు బాధ్యతగాను ఉంటే ఏ సమస్యా ఉండదు. అలా కాని పక్షంలో ఈ సినిమాలో చూపిన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వర్త్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.
Comments
Please login to add a commentAdd a comment