ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్‌ను ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి గత రెండేళ్లుగా ఇబ్బంది పెడుతుంది. 2022 సమయంలో ఆమెకు వెన్ను నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం కేరళ వెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు ఫైబ్రో మయాల్జియా వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని గతంలో ఆమె కూడా తెలిపింది. 2022 నుంచి ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్న పూనమ్ అప్పటి నుంచి చికిత్స కూడా తీసుకుంటుంది. కేరళలోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో కూడా చికిత్స తీసుకుంది.
తాజాగా పూనమ్ తన ఆరోగ్యంపై తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. నేచురోపతి వైద్యంలో ఎంతో గుర్తింపు పొందిన డా.మంతెన సత్యనారాయణ రాజును ఆమె కలుసుకున్నట్లు తెలిపింది. ఆయన్ను కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఫైబ్రోమైయాల్జియా వైద్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు ఎంతో అమూల్యం. మంచి మనసుగల వ్యక్తితో ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాధి గురించి చర్చించే అవకాశం కలగడం తన అదృష్టమని ఆమె పేర్కొంది.
ఫైబ్రోమైయాల్జియా వ్యాధితో చాలా ఇబ్బంది పడినట్లు పూనమ్ తెలిపింది. కనీసం దుస్తువులు కూడా వేసుకోలేకపోయానని అవి ధరిస్తున్నప్పుడు కూడా పెయిన్స్ వచ్చేవని వాపోయింది. దీంతో ఎప్పుడూ వదులుగా ఉన్న దుస్తువులే ధరించాల్సి వచ్చేదని చెప్పింది.
ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు
ఫైబ్రోమైయాల్జియాతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు నిద్రలేమితో భాదపడుతుంటారు. అలసటతో పాటుగా శరీరం మొత్తం విపరీతమైన నొప్పిని కలిగి ఉంటుంది. మెడ, భుజాలు, ఛాతీ, వీపు వద్ద ఎక్కువ పెయిన్ ఉంటుంది. జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటుగా డిప్రెషన్, ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. ఫైబ్రోమైయాల్జియా కోసం ఒకే పరిమాణానికి సరిపోయే మందులు లేవని వైద్యులు చెబుతున్న మాట. కానీ జీవనశైలి మార్పులతో దీనిని కంట్రోల్ చేయవచ్చని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment