కాలేజీ ప్రేమకథా సినిమాలకు ఉండే డిమాండే వేరు. 'కొత్త బంగారు లోకం' నుంచి 'కలర్ ఫోటో' వరకు చెప్పుకొంటే ఎన్నో మూవీస్ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. అందరూ కొత్తోళ్లే నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఇది ఎలా ఉంది? ఏంటనేదే ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)
కథేంటి?
అది 2004. రాయలసీమలోని పుంగనూరు అనే ఊరు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ కుర్రాడు వాసు (ప్రణవ్ ప్రీతమ్). అదే కాలేజీలో సీఈసీ చదువుతున్న కుమారి (శాగ్నశ్రీ వేణున్) అనే అమ్మాయి. అసలు పరిచయమే లేని వీళ్లిద్దరూ అనుకోని పరిస్థితుల్లో ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమలో పడతారు. కానీ కుమారి గురించి కొన్ని విషయాలు తెలిసేసరికి ఆమెతో గొడవపడతాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. వాసు ఎందుకు చనిపోవాలనుకున్నాడు? చివరకు వీళ్ల ప్రేమ కంచికి చేరిందా? అనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
తొలి ప్రేమ.. ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఓ జ్ఞాపకం. అయితే అది మంచి జ్ఞాపకమా? చేదు జ్ఞాపకమా అనేది ఆయా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది. 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' కూడా అలాంటి ఓ స్టోరీనే. ఇంటర్మీడియట్ చదివే కుర్రాడి జీవితంలో తొలి ప్రేమ అనేది తీపి గుర్తుల్ని మిగిల్చిందా? చేదు అనుభవాల్ని పరిచయం చేసిందా అనేదే మెయిన్ పాయింట్.
ఫస్టాప్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజీలో వాసు, అతడి ఫ్రెండ్స్, చుట్టూ ఉండే వాతావరణం, కుమారితో ప్రేమ లాంటివి చూపిస్తూ వెళ్లారు. ఇక సెకండాఫ్ వచ్చేసరికి ప్రేమలో కలతలు, మనస్పర్థలు లాంటివి ఉంటాయి. ఇందులో చెప్పుకోవడానికి కథేం కొత్తగా ఉండదు. ఇప్పటికే ఎన్నో కాలేజీ లవ్ స్టోరీల్లో కనిపించే సీన్స్ ఉంటాయి. కానీ అంతా కూడా మలయాళ సినిమాల్లో తీసినట్లు చాలా నిదానంగా అదే టైంలో క్యూట్‌గా సాగుతుంది. 90ల్లో పుట్టి పెరిగిన వాళ్లు ఈ సినిమా చూస్తే.. గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. తొలి ప్రేమ, తొలి ముద్దు లాంటివి మనసులో గిలిగింతలు పెట్టేస్తాయి. పాత ప్రేమలు మళ్లీ గుర్తొస్తాయి.
(ఇదీ చదవండి: 'నింద' సినిమా రివ్యూ)
మధ్య మధ్యలో ఫన్ మూమెంట్స్, జోకులతో సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఎమోషనల్‌గా ఎండ్ చేయడం బాగుంది. సినిమాలో పెద్ద కంప్లైంట్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ కాదు. 90ల్లో పుట్టి, ఫోన్లు లేని కాలంలో ఇంటర్మీడియట్ చేసిన అమ్మాయిలు అబ్బాయిలకు అయితే బాగా నచ్చుతుంది. ఈ కాలంలో పుట్టి పెరిగిన కుర్రాళ్లకు అబ్బే అని చెప్పి విసుగు వచ్చేస్తుంది.
ఎవరెలా చేశారు?
లీడ్ రోల్స్ చేసిన ప్రణవ్, శాగ్నశ్రీ.. ఇద్దరూ భలే క్యూట్‌గా చేశారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. పాటలు పెద్దగా గుర్తుండవు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. రైటర్, ఎడిటర్, దర్శకుడు.. ఇలా అన్ని బాధ్యతలు భుజానికెత్తుకున్న శ్రీనాథ్ పులకరం.. ఫీల్ గుడ్ మూవీని అందించాడు. కానీ 'కల్కి' మేనియాలో దీన్ని పట్టించుకుంటారా అనేది సస్పెన్స్.
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)
Comments
Please login to add a commentAdd a comment