ఏడు నెలల్లో 31 కిలోల బరువు తగ్గాను: పృథ్వీరాజ్ సుకుమారన్ | Prithviraj Sukumaran Reveals Interesting Things About The Goat Life Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Prithviraj Sukumaran: ఏడు నెలల్లో 31 కిలోల బరువు తగ్గాను

Published Tue, Mar 26 2024 3:16 PM | Last Updated on Tue, Mar 26 2024 3:33 PM

Prithviraj Sukumaran Talk About The Goat Life Movie - Sakshi

‘ఏ నటుడు కూడా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందుకోలేడు. కొన్ని వదిలేయాల్సి వస్తుంటుంది. ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చాలా సినిమా ఆఫర్స్‌ వచ్చాయి. కానీ కొన్ని సినిమాల్లో నటించలేకపోయాను. ఇలాంటి అరుదైన సినిమాకు  పనిచేస్తున్నప్పుడు మిగతా ఆఫర్స్ వదులుకోవడం తప్పదు’ అన్నారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం).  బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

వాస్తవ కథతో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను తెరకెక్కించారు దర్శకుడు బ్లెస్సీ. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఈ సినిమాకు ఆధారం. రచయిత బెన్యామిన్.. నజీబ్ జీవితానికి అక్షర రూపమిచ్చారు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ గోట్ డేస్ అనే పుస్తకాన్ని బెన్యామిన్ రాశారు. కేరళలో అనూహ్య పాఠక ఆదరణ పొందిన ఈ పుస్తకం రైట్స్ కోసం మలయాళం సినీ పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో, దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు. ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ దక్కించుకున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ తో 2008లో బ్లెస్సీ నన్ను సంప్రదించారు. అలా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) తో నా జర్నీ మొదలైంది.

► 2018లో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ముందుగా రాజస్తాన్ ఎడారిలో షూటింగ్ చేయాలని అనుకున్నా..అక్కడ అరబ్ దేశాల ఎడారుల వాతావరణం కనిపించలేదు. దాంతో జోర్డాన్ వెళ్లి చిత్రీకరణ జరిపాం. నేను బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ షూటింగ్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. షూటింగ్ ప్రాసెస్ లో ఉండగానే లాక్ డౌన్ వచ్చింది. అప్పుడు జోర్డాన్ షూటింగ్ లో ఉన్నాం. ప్రయాణాలు మొత్తం ఆపేశారు. అక్కడి నుంచి బయటపడే వీలు లేదు. వందేభారత్ ఫ్లైట్ తో కేరళ చేరుకున్నాం. ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించాం. ఇలా ఎన్నో కష్టాలు పడి, అరుదైన లొకేషన్స్ లో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ లోనూ రాజీ లేకుండా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో వర్క్ చేశాం. వాస్తవంగా రెండేళ్లలో పూర్తి చేయాల్సిన సినిమా ఇది. కోవిడ్ వల్ల ఆలస్యమైంది.

► ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే షూటింగ్ కోసం కష్టపడాల్సి వస్తుందని తెలుసు. రోజుల పాటు డైట్ చేశాను. నజీబ్ పాత్రలా మారేందుకు ప్రయత్నించాను. ఎందుకంటే నా క్యారెక్టర్ శరీరాకృతి ద్వారా ప్రేక్షకులు ఆ కథను, క్యారెక్టర్ ను అనుభూతి చెందుతారు. క్యారెక్టర్ కోసం నేను కఠినమైన ఆహార నియమాలు పాటించాను. 31 కిలోల బరువు తగ్గాను. ఈ క్రమంలో నా ఆరోగ్యం గురించి మా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. నా భార్య, మా పాప సినిమా కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ గా నిలిచారు. నజీబ్ ఎడారిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఉంటాడని ఊహించుకుంటూ ఈ క్యారెక్టర్ లో నటించాను. కష్టపడినా నజీబ్ క్యారెక్టర్ ను విజయవంతంగా పోషించినందుకు సంతోషంగా ఉంది.

► "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా కోసం మేము చేసిన సుదీర్ఘ ప్రయాణంలో మమ్మల్ని నడిపించిన విషయం మేమొక గొప్ప సినిమా చేస్తున్నామనే నమ్మకమే. ప్రేక్షకులకు ఒక స్పెషల్ మూవీ ఇవ్వబోతున్నామనే విశ్వాసంతోనే 16 ఏళ్లు సినిమాతో ముందుకు సాగాం. నజీబ్ అనే వ్యక్తి ఇప్పటికీ మన మధ్యే ఉన్నాడు. అతను తన జీవితం ద్వారా మనకు అందించిన స్ఫూర్తి ఎంతో గొప్పది.

► "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా కోసం తీవ్రమైన చలిలో, వేడి వాతావారణంలో, బలమైన గాలులు వీచే వాతావరణంలో షూటింగ్ చేశాం. ఏడారి జీవితాన్ని సజీవంగా తెరపై చూపించాలంటే అక్కడి వాతావరణాన్ని క్యాప్చర్ చేయాలి. ఇందుకోసం మా మూవీ టీమ్ ప్రతిభావంతంగా పనిచేసింది.

► డైరెక్టర్ బ్లెస్సీ నేను "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా రిలీజ్ కాబోతున్న రోజుకోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నాం. ఇది మా కల. ఆ కల నిజమవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా రూపకల్పనలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి, ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు అవన్నీ దాటుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఇంత కష్టపడిన సినిమా ప్రేక్షకుల దగ్గరకు చేరాలి. ఇందుకు పేరున్న దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ను సెలెక్ట్ చేసుకున్నా.

► లాస్ట్ ఇయర్ సలార్ లో నన్ను ప్రేక్షకులు రాజమన్నార్ గా ఆదరించారు. ఇప్పుడు "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాలో సలార్ కు పూర్తి భిన్నమైన క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నా. సర్వైవల్ థ్రిల్లర్స్ ప్రేక్షకులకు తప్పకుండా ఆసక్తి కలిగిస్తాయి. నజీబ్ క్యారెక్టర్ లో నా పర్ ఫార్మెన్స్ ఎలా ఉందో ప్రేక్షకుల స్పందనతో తెలుసుకోవాలని అనుకుంటున్నా.

► నా కెరీర్ విషయానికి వస్తే అనుకోకుండానే నటుడిని అయ్యాను. మనం సినిమాలను కమర్షియల్, కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ అంటూ విభజన చేస్తాం. కానీ నా దృష్టిలో మంచి సినిమాకు మంచి స్క్రిప్ట్ ఉండాలి. కమర్షియల్ మూవీస్ లోనూ బలమైన కథా కథనాలు ఉంటాయి. మంచి నటులు తమకొచ్చే అరుదైన అవకాశాలు వదులుకోరని భావిస్తా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement