కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి 'మల్లేశం', 'బలగం' సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డార్లింగ్'. గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ గట్టిగానే చేసిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఇది ఎలా ఉంది? హిట్ కొట్టిందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథేంటి?
రాఘవ్ (ప్రియదర్శి).. పెళ్లి చేసుకుని భార్యని హనీమూన్‌కి పారిస్ తీసుకెళ్లాలనే ధ్యేయంతో పెరిగి పెద్దవుతాడు. తల్లిదండ్రులు చూపించిన నందిని(అనన్య నాగళ్ల)తో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ ఈమె, ప్రేమించిన వాడితో వెళ్లిపోతుంది. పెళ్లి పెటాకులైందని రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా అక్కడ ఆనంది (నభా నటేష్) కలుస్తుంది. పరిచయమైన ఆరు గంటల్లోనే రాఘవ్ ఈమెని పెళ్లి చేసుకుంటాడు. ఇంతకీ ఆనంది ఎవరు? ఆమె ఒక్కో టైంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
ఒకే మనిషి ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తించడం.. దీన్నే ఇంగ్లీష్‌లో స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. గతంలో 'అపరిచితుడు' మూవీని ఇదే కాన్సెప్ట్‌తో తీశారు. కాకపోతే అది పూర్తిగా ఎమోషనల్ వేలో సాగుతుంది. ఒకవేళ ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయికి ఉందని తెలిస్తే ఏమైందనేదే 'డార్లింగ్' సినిమా.
ట్రైలర్, ప్రచార చిత్రాలు చూస్తే ఈ మూవీ కథేంటనేది తెలిసిపోతుంది. ఇందులో పెద్దగా దాపరికాలు లేవు. ఫస్టాప్ అంతా హీరో... పెళ్లి ధ్యేయమన్నట్లు పెరిగి పెద్దవడం, పెళ్లి నిశ్చయమైన తర్వాత అమ్మాయి మరో వ్యక్తితో లేచిపోవడం, సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ఊహించని పరిస్థితుల్లో ఊరు పేరు తెలియని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. మధ్యమధ్యలో కామెడీ.. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌కి పర్వాలేదనిపించే ట్విస్ట్.
సెకండాఫ్‌లో భార్యకు ఎందుకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుసుకోవడానికి భర్త చేసే ప్రయత్నాలు, మొదట్లో కామెడీ కామెడీగా ఉండే సినిమా.. చివర్లో ఎమోషనల్‌గా ఎందుకు ఎండ్ కావాల్సి వచ్చిందనేది మూవీ చూసి తెలుసుకోవాలి. స్టోరీ పరంగా ఇది మంచి లైనే. కానీ డైరెక్టర్ చాలాసార్లు తడబడ్డాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అని ఫస్టాప్ అంతా నవ్వించాడు. ఇంటర్వెల్‌కే కథని ముగించిన ఫీలింగ్ తెప్పించాడు.
అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చి హీరోయిన్‌కి మల్టీపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని చెప్పి, మరోసారి ఇదే కాన్సెప్ట్‌పై నవ్వించాలనుకున్నాడు. కానీ సెకండాఫ్‌లో ఇది సరిగా వర్కౌట్ కాలేదు. స్టోరీ అంతా ఒకే పాయింట్ దగ్గర తిరిగిన ఫీలింగ్ వస్తుంది. కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి కొన్ని ఎమోషనల్ సీన్లు పడటంతో మరీ సూపర్ కాకపోయినా పర్లేదు అనిపించే సినిమా చూశాంలే అనే అభిప్రాయంతో థియేటర్ బయటకు వస్తాం.
హీరోయిన్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ప్రేక్షకుడికి ఎక్కవు, నచ్చవు. ఆమె కంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషన్ అంతో ఇంతో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడన్నది వదిలేస్తే.. సీన్లు సీన్లుగా చూస్తే మాత్రం కొన్ని చోట్ల బాగానే పేలాయి.
ఎవరెలా చేశారు?
'డార్లింగ్' స్టోరీని హీరోయిన్ బేస్డ్‌గా రాసుకున్నారు. కానీ నభా నటేష్‌ని ఆ పాత్ర కోసం తీసుకుని పొరపాటు చేశారు! ఎందుకంటే ఈమె పాత్రతో ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ కాలేకపోతారు. కొన్ని సీన్లలో పర్లేదనిపిస్తుంది కానీ కొన్నిచోట్ల విసిగిస్తుంది. హీరోగా చేసిన ప్రియదర్శి.. తనకు అలవాటైన కామెడీ ప్లస్ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఓ పాటలో డ్యాన్స్ కూడా చేశాడు. హీరో తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్, మామగా చేసిన రఘబాబు, పిన్నిగా చేసిన నటి బాగా నటించారు. బ్రహ్మానందం, సుహాస్, నిహారిక లాంటి స్టార్స్ అతిథి పాత్రలు చేశారు. కాకపోతే పెద్దగా వర్కౌట్ కాలేదు.
టెక్నికల్ టీమ్ 'డార్లింగ్' కోసం బాగానే కష్టపడ్డారు. పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక‍్కడ బాగుంది. సినిమాటోగ్రఫీ గుడ్. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. కొత్త డైరెక్టర్ అశ్విన్ రామ్.. స్క్రిప్ట్‌ని ఇంకాస్త బెటర్‌గా రాసుకుని ఉండాల్సింది. అలానే 2 గంటల 41 నిమిషాల నిడివి ఎక్కువైపోయింది. 15-20 నిమిషాలు తగ్గించి, సెకాండాఫ్ కాస్త ట్రిమ్ చేసుంటే సినిమా ఎంటర్ టైనింగ్‌గా ఉండేది. జస్ట్ ఫన్ కోసమే థియేటర్‌కి వెళ్లాలనుకునే ప్రేక్షకులకు 'డార్లింగ్' మంచి ఆప్షన్.
రేటింగ్: 2.75
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment