ప్రియాంక సింగ్.. సెలబ్రిటీలు సైతం కుళ్లుకునేంత అందం ఈమె సొంతం. పుట్టుకతో అబ్బాయి అయినా తనలో ఆడ లక్షణాలు ఉండటం, అలా కనిపించేందుకే ఎక్కువ ఇష్టపడటంతో ఆపరేషన్ చేయించుకుని మరీ అమ్మాయిగా మారింది. బిగ్‌బాస్ షో ద్వారా జనాలకు మరింత చేరువైన ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టింది.
సర్జరీ చేయించుకున్నా..
ప్రియాంక మాట్లాడుతూ.. చిన్నప్పుడు అక్క స్కూలు నుంచి రాగానే తన డ్రెస్సులు వేసుకునేదాన్ని. రానురానూ నాకు అమ్మాయిలాగే ఉండాలనిపించింది. పదో తరగతి తర్వాత హైదరాబాద్ వచ్చాను. మేకప్ ఆర్టిస్టుగా చేశాను. జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేశాను. బయట షోలు చేశాను. ఆ డబ్బుతో సర్జరీ చేయించుకున్నాను. అప్పుడు విపరీతమైన నొప్పితో బాధపడ్డాను. ఆస్పత్రిలో పట్టించుకునేవాళ్లే లేరు. ఓపక్క రక్తస్రావం అవుతున్నా.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి గేటు వరకు నడుచుకుంటూ వెళ్లాను.
బ్యాంకు బ్యాలెన్స్ జీరో..
సర్జరీ నుంచి కోలుకునేలోపే ఆర్థరైటిస్‌తో ఏడాదిపాటు మంచానికే పరిమితమయ్యాను. 90 కిలోల దాకా పెరిగాను. దానికి చికిత్స చేయించుకునేసరికే నా బ్యాంకు బ్యాలెన్స్ జీరో అయింది. అక్కడి నుంచి మళ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడిదాకా వచ్చాను. అమ్మాయిగా మారాలని చాలామంది అనుకుంటారు. కానీ సర్జరీ వల్ల చాలా నొప్పి భరించాల్సి ఉంటుంది. హార్మోన్ థెరపీ కూడా కచ్చితంగా చేయించుకోవాలి. ఇప్పుడైతే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే పెళ్లిపై ఆసక్తి లేదు.
చర్మం కాలిపోయింది
నా జీవితంలో మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాను. పదో తరగతి అయ్యాక.. ఊర్లో అందరూ ఏదైతే అన్నారో అదే మాట నాన్న నోటి వెంట నుంచి వచ్చేసరికి తట్టుకోలేకపోయాను. అప్పుడు కిరోసిన్ పోసుకుని కాల్చుకున్నాను. ఆ సమయంలో 60 శాతం వరకు చర్మం కాలిపోయింది. దానికి చికిత్స తీసుకున్నాను. తర్వాత లవ్‌లో ఫెయిలైనప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. సర్జరీ అయ్యాక ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఆ బాధ భరించలేక మరోసారి నిద్రమాత్రలు మింగాను. అయినా సరే మళ్లీ బతికి బయటపడ్డాను.
మందు తాగేదాన్ని..
నా కోసం ఏదో మంచిది రాసిపెట్టుంది, అందుకే దేవుడు బతికిస్తున్నాడనుకున్నాను. భగవంతుడిని నమ్ముతాను. నేను మందు తాగడమనేది బ్రీజర్‌తో మొదలుపెట్టాను. మందు, సిగరెట్ తాగేదాన్ని. కానీ అవి మానేశాను. సినిమాల విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాను. హాట్‌స్టార్‌లో హీరోయిన్‌గా లాంచ్ కాబోతున్నాను. చిన్న చిన్న సినిమాలతో పాటు హీరోయిన్‌గా కూడా చేస్తున్నాను. ఎప్పటికైనా ఫుడ్ బిజినెస్ చేయాలనుంది' అని చెప్పుకొచ్చింది.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి!
- పోడూరి నాగ ఆంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment