ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) శనివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా విజయవాడ మురారి సొంత ఊరు. 1944 జూన్ 14న జన్మించారు. ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో సినిమా అంటే ప్రేమతో చెన్నైకి చేరుకున్నారు. తొలుత దర్శకుడు వి. మధుసూదన్ దగ్గర సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మురారి ఆ తర్వాత నిర్మాతగా మారి, యువచిత్ర ఆర్ట్స్ పతాకంపై పలు చిత్రాలు నిర్మించారు. 1978లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన ‘సీతామహాలక్ష్మి’ నిర్మాతగా మురారికి తొలి చిత్రం.
ఆ తర్వాత శోభన్‌బాబు కథానాయకుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘గోరింటాకు’, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘జేగంటలు’, కృష్ణంరాజు హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘త్రిశూలం’, దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘అభిమన్యుడు’, బాలకృష్ణ హీరోగా రెండు చిత్రాలు ‘సీతారామ కళ్యాణం’, ‘నారి నారి నడుమ మురారి’, వెంకటేష్ కథానాయకుడిగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’, నాగార్జున హీరోగా ‘జానకి రాముడు’ వంటి ఉత్తమ చిత్రాలను నిర్మించారు.
మురారికి సంగీతం అంటే ఇష్టం. ఆయన నిర్మించిన వాటిలో దాదాపు అన్నీ మ్యూజికల్ హిట్సే. అన్ని చిత్రాలకు కేవీ మహదేవన్ సంగీతదర్శకుడిగా చేశారు. దక్షిణ భారత చలన చిత్ర మండలికి, తెలుగు నిర్మాతల మండలికి గౌరవ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా కె. మురారి సాహితీ ప్రియుడు కూడా. ‘నవ్వి పోదురుగాక నాకేంటి’ అనే పుస్తకం రచించడంతో పాటు ‘తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర’ (1931–2005)కు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నవయుగ ఫిలింస్ మురారి బాబాయి కాట్రగడ్డ శ్రీనివాసరావుదే. మురారి ముక్కుసూటి మనిషి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. చెన్నై, నీలాంగరైలో నివసిస్తున్న కె. మురారి శనివారం రాత్రి 8. 55 గంటల ప్రాంతంలో భోజనం చేశాక, గ్యాస్ సమస్య కారణంగా సిరప్పు వేసుకున్నారు. ఆ వెంటనే కార్డియాక్ అరెస్ట్‌కు గురై తుది శ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మురారికి భార్య, కొడుకు–కోడలు ఉన్నారు. ఆయన భౌతికకాయానికి ఆదివారం చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment