పీఎస్ మిత్రన్
హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో రూపొందిన తమిళ చిత్రం ‘సర్దార్’. ఇందులో రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. కాగా అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. ‘సర్దార్’ రిలీజ్ సందర్భంగా దర్శకుడు పీఎస్ మిత్రన్ మాట్లాడుతూ– ‘‘నా దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘ఇరుంబుదురై’ (2018) (తెలుగులో ‘అభిమన్యుడు’) డబ్బింగ్ వర్క్స్ సమయంలో నాకు ‘సర్దార్’ ఐడియా వచ్చింది.
కథ సిద్ధమైన తర్వాత నిర్మాత లక్ష్మణ్‌గారికి చెప్పినప్పుడు ఆయన హీరో కార్తీగారిని కలవమన్నారు. ఆయనకూ కథ నచ్చడంతో ‘సర్దార్’ మొదలైంది. వర్తమాన కాలంతో పాటు 1980లో నడిచే కథ ‘సర్దార్’. ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం 1980లో ఓ స్పై (గూఢచారి)ని తయారు చేయాలని ప్రయత్నించింది. అయితే సైన్యంలో పని చేసే వ్యక్తిని గూఢచారిగా మార్చడం అంత సులువు కాదు.
గూఢచారికి నటించడం రావాలి, మారు వేషాలు వేయగలిగి తప్పించు కోవడం తెలిసుండాలి. దీంతో ఓ రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు. ఇది వాస్తవంగా జరిగింది. ఈ సంఘటనే ‘సర్దార్’ కథకు స్ఫూర్తి. కానీ ‘సర్దార్’ కథ పూర్తిగా వాస్తవం కాదు.. కొన్ని సంఘటనలు కల్పితం. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. ఒకరు గూఢచారిగా ఏ గుర్తింపును కోరుకోని వారైతే, మరొకరు పబ్లిసిటీని ఇష్టపడేవారు. ఈ రెండు పాత్రలు ఆడియన్స్‌కు ఆసక్తికరంగా అనిపిస్తాయి. కార్తీ అద్భుతంగా నటించారు. నాగార్జునగారి అన్నపూర్ణ స్డూడియోస్ ‘సర్దార్’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అఖిల్‌తో ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment