
సాక్షి, చెన్నై: సినీ నటుడు విజయ్‌తో పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి భేటీ అయ్యారు. చెన్నై పయనూర్‌లోని విజయ్ ఇంట్లో శుక్రవారం సాయంత్రం గంటపాటు ఇద్దరూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న నగర పాలక సంస్థల ఎన్నికల్లో ఆయన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో విజయ్‌ను కలవడం చర్చకు దారితీసింది. భేటీ అనంతరం వెలుపలకు వచ్చిన రంగ స్వామిని మీడియా ప్రశ్నించగా, మర్యాద పూర్వకంగానే కలిసినట్లు వ్యాఖ్యానించారు. విజయ్ తనకు మంచి మిత్రుడని, ఆయనపై అభిమానంతోనే వచ్చినట్లు పేర్కొన్నారు.
రాజకీయంగా చర్చనీయాంశం
ఈ భేటీ ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారి తీసింది. పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్– బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం ప్రధాని మోదీని రంగన్న ఇంత వరకు కలవలేదు. అయితే విజయ్‌ను కలిసేందుకు పుదుచ్చేరి నుంచి రావడం, తనకు మంచి మిత్రుడు అని వ్యాఖ్యానించడాన్ని రాజకీయ వర్గాలు నిశితంగానే పరిశీలిస్తున్నాయి. విజయ్ మక్కల్ ఇయక్కంను పర్యవేక్షిస్తున్న పుదుచ్చేరికి చెందిన పి. ఆనంద్ ఈ భేటీకి ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment