యూట్యూబ్ వేదికగా ‘పూరి మ్యూజింగ్స్’పలు విషయాలపై తన అభిప్రాయాలు చెబుతూ వరుస ఆడియోలు రిలీజ్ చేస్తున్నాడు డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఎలాంటి వివాదాలకు తావులేకుండా, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తూ ఆలోచనల్లో పడేస్తున్నాడు. తాజాగా ఆయన ప్రపంచంలో ఆడవాళ్లు అనేవాళ్ళు లేకపోతే ఏడుపులు ఉండవనే భావన చాలా తప్పని చెబూతూ.. బాబ్ మార్లే పాడిన పాటకు అసలైన అర్థాన్ని ఆయన వివరించారు. అసలు ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
‘ఓ చల్లటి సాయంత్రం.. పటాయ్‌లో బీచ్ ఒడ్డున రెస్టారెంట్‌లో నేను కూర్చున్నప్పుడు, ఒక వ్యక్తి బాబ్ మార్లే పాటలు పాడుతూ ఉన్నాడు. రెండు పాటల తర్వాత అతను ‘నో విమెన్ నో క్రై’ అనే సాంగ్‌ని మొదలుపెట్టాడు. ఆ సాంగ్ వింటూనే రెస్టారెంట్‌లోని మగవాళ్లంతా కూడా అరుపులు అలాగే విజిల్స్ వేయడం ప్రారంభించారు. దీంతో రెస్టారెంట్‌లోని ఆడవాళ్లంతా కూడా మొహాలు చిన్నబుచ్చుకుని కూర్చున్నారు. సింగర్ ‘నో విమెన్ నో క్రై’ అన్నప్పుడల్లా రెస్టారెంట్‌లోని మగాళ్లు అతడితో గొంతు కలిపి మరి అంతకంటే పెద్దగా పాడేశారు. మిగతా ఏ లిరిక్స్ పాడరు కానీ ఆ ఒక్కలైన్ మాత్రంగా గట్టిగా పాడేస్తారు. న్యూజిలాండ్‌లోనూ.. గోవాలోనూ ఇదే జరిగింది. కానీ ఈ పాట అసలు భావం ‘నో విమెన్ నో క్రై’ కాదు, ‘నో విమెన్ న క్రై’. అంటే ఆడవాళ్లు అస్సలు ఏడవద్దు అని అర్థం. చాలా మంది ఈ పాట బాబ్ మార్లే రాశాడని అనుకుంటారు. నిజానికి ఈ పాట రాసింది మాత్రం విన్సెంట్ ఫోర్డ్. విన్సెంట్ ఫోర్ట్ రాసిన ఈ లిరిక్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని బాబ్ మార్లే ఈ పాట పాడాడు.
‘ట్రెంచ్ టౌన్‌లో ఒక బిడ్డను పోలీసులు కొడుతుంటే ఆ ఏడుపు నాకు బాగా వినిపిస్తుంది. ట్రెంచ్ టౌన్‌లో ప్రభుత్వ స్థలంలో కూర్చున్నప్పుడు మంచి వ్యక్తులను మరియు స్నేహితులను కలవడం అలాగే రాత్రులు దీపాలు వెలిగించడం అదే విధంగా కార్న్ మీల్‌తో పూరిట్జ్ వండుకోవడం నాకు బాగా గుర్తుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ రాజకీయాల వల్ల అలాంటి ఆహ్లాదరకరమైన వాతావరణాన్ని మనం బాగా కోల్పోతున్నాం. త్వరలోనే మనకు మంచి రోజులొస్తాయి’ అని విన్సెంట్ రాశాడట . దాని స్ఫూర్తితో బాబ్ మార్లే ఆడవాళ్లు మీరు ఏడవద్దు అంటూ ఆలపించాడు. కానీ ఈ పాటను మనం అందరమూ కూడా తప్పుగా అర్థం చేసుకున్నాం. అసలు ఆడవాళ్లే లేకపోతే ఎలాంటి సమస్యలు ఉండవని మనమందరం అనుకుంటున్నాం. జమైకా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా అందరు ఈ పాటను తప్పుగా అర్థం చేసుకున్నారని ‘నో విమెన్ నో క్రై’ అనే పదం మినహా పాటలోని మిగతా లిరిక్స్ గురించి అస్సలు ఎవరూ పట్టించుకోలేదు. అలా ఈ పాటను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లలో నేను కూడా ఉన్నాను.ఒకవేళ ఈ జాబితాలో నాతోపాటు మీరు కూడా ఉంటే ఇకపై పాట విన్నప్పుడు అస్సలు గొడవ చేయొద్దు. ఇది ఆడవాళ్ల కన్నీళ్లు తుడిచే పాట అని నో విమెన్ నో క్రై ’అని పూరి చెప్పుకొచ్చాడు.
ఇక సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం పూరి... విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఆగస్ట్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment