
పుష్ప చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). ఇటీవల విడుదలైన పుష్ప2 చిత్రం హాలీవుడ్‌ని సైతం మెప్పించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 1871 కోట్లు వసూళ్లను సాధించింది రికార్డులు సృష్టించింది. ఇలా పుష్ప, పుష్ప 2 చిత్రాలతో ఎన్నో అవార్డులను, రికార్డులను తన ఖాతాలో వేసుకున్న బన్నీ తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు.
ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్' ఇప్పుడు ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ (The Hollywood Reporter India) పేరుతో భారత్‌లోనూ ప్రచురితం కానుంది. ఈ మ్యాగజైన్ తొలి సంచిక అల్లు అర్జున్ ముఖచిత్రంతో తీసుకురావడం విశేషం. తాజాగా ఈ కవర్ పేజ్ ఫొటో షూట్‌ను నిర్వహించారు. దానికి సంబంధించిన ప్రోమో వీడియోను తాజాగా షేర్ చేశారు. అందులో అల్లు అర్జున్ పంచుకున్న కొన్ని విషయాలను చూపారు.
‘ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది. బలం, ఆత్మవిశ్వాసం అనేవి మనసులో ఉంటాయి. వాటిని ఎవరూ తీసేయలేరు. కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి. ఇది అలాంటిదే. విజయం తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యం.
జీవితంలో సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలా మందిని నేను చూశాను. అది వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే నేను వంద శాతం సామాన్యుడినే. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇదే భావనతో ఉంటాను. అలాగే విరామ సమయంలో కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటాను. ఏమీ చేయకుండా ఉండటమే నాకిష్టం. కనీసం పుస్తకం కూడా చదవను’అని ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ వివరించారు.