
ముంబై: బిగ్‌బాస్-14 కంటెస్టెంట్, సింగర్ రాహుల్ వైద్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. నటి దిశా పర్మార్‌ను అతడు వివాహమాడనున్నట్లు సమాచారం. కాగా ఆదివారం రాహుల్ బిగ్‌బాస్ హౌజ్‌ను వీడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండలేకపోతున్నానని, అదే విధంగా తనకంటే గొప్పగా ఆడుతున్న వారికి టాప్‌లో చోటు దక్కాలనే ఉద్దేశంతో తనకు తానుగా వెళ్లిపోతున్నట్లు పేర్కొన్నాడు. తన నిర్ణయంతో అభిమానులను నిరాశపరిచానని, అందుకు క్షమించాలని కోరాడు.
ఇక హౌజ్‌లో ఉన్న సమయంలో బంధుప్రీతిని కారణంగా చూపి తోటి కంటెస్టెంట్ జాన్ కుమార్‌ను నామినేట్ చేసి హోస్ట్ సల్మాన్ ఖాన్ ఆగ్రహానికి గురైన రాహుల్ వైద్య, ఆ తర్వాత కూడా తన నోటి దురుసు కారణంగా తరచూ వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలో అనూహ్యంగా షో నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్ ద్వారా కావాల్సినంత పాపులారిటీ పొందిన రాహుల్ తన ప్రేమ వ్యవహారం వల్ల కూడా సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాడు. నటి దిశా పర్మార్‌ను ప్రేమిస్తున్న అతడు.. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. ‘‘నన్ను పెళ్లిచేసుకుంటావా’’ అని ట్విటర్ వేదికగా ప్రతిపాదన చేశాడు. ఇందుకు నేరుగా సమాధానం ఇవ్వని దిశ.. తనకు సమాధానం చెప్పేశానంటూ నెటిజన్లను అయోమయంలోకి నెట్టారు.(చదవండి: ప్లేట్లు పగులగొడుతూ డ్యాన్స్.. వైరల్!)
ఈ విషయం గురించి ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన రాహుల్ తల్లి గీత వైద్య.. దిశ తమ ఇంటి కోడలిగా వస్తే సంతోషపడతానని తన మనసులో మాట బయటపెట్టారు. ‘‘అవును.. వీలైనంత త్వరలో రాహుల్ పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. నాకు తెలిసి దిశ తన ప్రపోజల్‌ను అంగీకరించింది. ఓ తల్లిగా నాకు ఇంతకన్నా సంతోషం ఏముంటుంది. తను చాలా మంచి అమ్మాయి. మా ఇంటికి కూడా వచ్చింది. వాళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందనుకున్నా. కానీ ప్రేమలో ఉన్నారని ఇటీవలే తెలిసింది. అయితే దిశ కుటుంబంతో మేం ఇంతవరకు మాట్లాడలేదు. తను చెబితే వాళ్లింట్లో వాళ్లతో మాట్లాడి విషయాన్ని ముందుకు తీసుకువెళ్తా’’అని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ వైద్య ఇప్పుడు ఇంటికి చేరడంతో త్వరలోనే అతడు పెళ్లి జరిగే అవకాశం ఉందంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా ఇండియన్ ఐడల్ షోతో గుర్తింపు పొందిన రాహుల్ వైద్య దో చార్ దిన్, కహ్ దోనా, తేరా ఇంతెజార్ వంటి పాటలు ఆలపించాడు.
Comments
Please login to add a commentAdd a comment