యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నటుడు రాజీవ్ కనకాల మంచి స్నేహితులు అన్న విషయం చాలామందికి తెలుసు. అయితే స్నేహాని కంటే ముందు వీరి మధ్య కయ్యం పుట్టిందట. అదే తర్వాత స్నేహంగా మారిందట! తమ మధ్య పరిచయం ఎలా మొదలైంది? అసలు గొడవెందుకు వచ్చింది? అన్న విషయాలను తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'నిన్ను చూడాలని సినిమాకు జూ.ఎన్టీఆర్‌కు నన్ను డబ్బింగ్ చెప్పమన్నారు. ఎందుకో తనకు నా గొంతు సరిపోదని చెప్పి వెనక్కు వచ్చేశాను. దీంతో అతడే తన డబ్బింగ్ చెప్పుకున్నాడు.
మొదటి రోజే కామెంట్
స్టూడెంట్ నెం.1 సినిమాలో మొదటిసారి కలిశాం. తొలి రోజు మధ్యాహ్నానికే గొడవ. నామీద ఏదో కామెంట్ చేశాడు. నా స్నేహితుడు చంద్రశేఖర్ స్టైలిష్‌వి కళ్లజోడు పట్టుకొస్తే నా పాత్రకు బాగా సూటవుతుందని అరువు తీసుకున్నాను. ఆ కళ్లజోడు పెట్టుకుని యాక్ట్ చేస్తున్నాను. ఛా.. అవసరమా? అన్నాడు. అవును, అవసరమే అన్నాను. జక్కన్న దగ్గరికెళ్లి చెప్పాను. నామీద కామెంట్ చేశాడు. రేపు పొద్దున నన్ను ఏదో ఒకటి అంటే నేను కూడా తిరిగి కౌంటరిస్తాను. అటు తిరిగి, ఇటు తిరిగి నన్నే అంటారు. నేను సినిమాలో నుంచి వెళ్లిపోతాను అన్నాను. రాజమౌళి మాత్రం.. ఆయనేదో సరదాగా జోక్ చేశాడు, మరీ సెన్సిటివ్‌గా ఆలోచిస్తున్నావ్ అన్నాడు. సరేనని ఊరుకున్నాను.
అపరిచితుడిలా నటించాడు
తెల్లారి సెట్‌కు వెళ్తే ఎన్టీఆర్.. రాజీవ్‌గారు, నమస్కారం.. రండి సర్ అన్నాడు. ఇంత అపరిచితుడులా ఉన్నాడేంటి అని లైట్ తీసుకున్నాను. మూడో రోజు మళ్లీ ఏదో జోక్ చేశాడు. నాలుగో రోజు ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఈ నాలుగురోజుల్లోనే మాకు తెలియకుండా మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యాం. ఎంతలా అంటే అప్పటిదాకా రాజీవ్ గారు అని పిలిచే తారక్ రెండో షెడ్యూల్‌కు వచ్చేసరికి ఒరేయ్.. రాజాగా.. రారా అని పిలిచాడు. రాజీవ్‌గారు నుంచి రారానా? అని షాకయ్యాను. మరి ఫ్రెండంటే అనరా? అన్నాడు. అలా క్లోజయ్యాం' అని చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల.
Comments
Please login to add a commentAdd a comment