తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధిపై మంత్రి ఎవి వేలు రచించిన "కళైంజ్ఞర్ ఎనుమ్ థాయ్" పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీ అక్కడ సరదాగ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కరుణానిధి మరణం తర్వాత పార్టీని చక్కగా నడిపిస్తున్నారని సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి రజనీ అన్నారు. 'పాఠశాలలో కొత్త విద్యార్థిని ఒక టీచర్‌కు సరైన దారిలోపెట్టడం చాలా సులభం. కానీ, పాత విద్యార్థులను(సీనియర్ నాయకులు) సమన్వయం చేయడం చాలా కష్టం. అందులో ఆ పాత విద్యార్థులు కూడా సాధారణమైన వారు కాదు. దురైమురుగన్ అని ఒకరున్నారు. కళాకారుడి కంట్లోనే వేలు పెట్టి ఆడించిన వ్యక్తి ఆయన. ఇలా ర్యాంకులు సాధించిన వారు పార్టీలో ఉన్నారు. దురై మురుగన్ వంటి పెద్దలున్న ఈ పార్టీని స్టాలిన్ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అంటూనే.. హ్యాట్సాప్ స్టాలిన్ సర్' అని రజనీకాంత్ కామెంట్ చేశారు.
రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యపై అక్కడి నేతలు పలురకాలుగా చర్చించుకుంటూ తమకు తోచిన విధంగా రియాక్ట్ అవుతున్నారు. రజనీకి కౌంటర్‌గా మంత్రి దురై మురుగన్ ఇలా చెప్పుకొచ్చారు. 'సినిమా రంగాన్ని చూస్తే.. పెద్ద నటులంతా వయసు మీరి, పళ్ళు పోయి, గడ్డాలు పెంచుకుని చావబోయే స్థితిలో కూడా నటిస్తూనే ఉన్నారు. దీంతో యువకులకు అవకాశాలు రావడం లేదని తిప్పికొట్టారు.' ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, తాజాగా రజనీ కూడా మరోసారి రియాక్ట్ అయ్యారు. దురై మురుగన్ మాట్లాడిన మాటలు పెద్ద విషయమేమీ కాదు. మా ఇద్దరి స్నేహం ఎప్పటిలాగే కొనసాగుతుంది. మా చమత్కారాన్ని శత్రుత్వంగా చూపించకండి. గతంలో మాదిరే మా స్నేహం ఉంటుంది.' అని ఈ వివాదానికి రజనీ ఫుల్‌స్టాప్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment