సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాటపట్టారు. బుధవారం చెన్నై నుంచి విమానంలో ఆయన బయల్దేరారు. హిమాలయాల్లో వారం రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేయనున్నారు. చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ముఖ్యం.. హిమాలయాలకు వెళ్లిన ప్రతిసారి కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. అందుకే తాను ప్రతి ఏటా వెళ్తున్నట్లు అన్నారు.
ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని రజనీకాంత్ అన్నారు. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు. అంతకుముందు ఇంటి నుంచి బయలు దేరిన రజనీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళతానని.. ఇప్పుడు కూడా బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను సందర్శించేందుకు వెళ్తున్నానని అన్నారు. గతేడాది జైలర్ సినిమా విడుదలకు ముందు కూడా హిమాలయాలకు రజనీకాంత్ వెళ్లిన విషయం తెలిసిందే.
ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సున్నితంగా రజనీ తప్పుకున్నారు. అలాగే, రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి బద్రీనాథ్, కేదార్‌నాథ్, బాబాజీ గుహతో సహా పలు పవిత్ర స్థలాలను సందర్శించిన అనంతరం జూన్ 4న చెన్నైకి తిరిగి రానున్నట్లు సమాచారం. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టయాన్’ సినిమాలో తన భాగం చిత్రీకరణని పూర్తి చేశారు రజనీ. ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగా వచ్చిందని రజనీ తెలిపారు. ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment