టైటిల్: రహస్యం ఇదం జగత్
నటీనటులు: రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ తదితరులు
దర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్
సంగీతం: గ్యానీ
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్
సినిమాటోగ్రఫీ: టైలర్ బ్లూమెల్
నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల
విడుదల తేదీ : 8 నవంబర్ 2024
సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్‌కు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి గిరాకీ ఉంది. అలా ఈ జానర్‌లో వచ్చిన సినిమానే రహస్యం ఇదం జగత్. పురాణ ఇతిహాసాలను తెరపై చూపిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించేందుకు ప్రయత్నించామంటున్నాడు దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్. మరి ఆయన ప్రయత్నం ఏమేరకు ఫలించిందో రివ్యూలో చూసేద్దాం..
కథ
కథ మొత్తం అమెరికాలోనే జరుగుతుంది. ఇండియాలో ఉన్న తండ్రి చనిపోవడంతో తల్లి కోసం స్వదేశానికి తిరిగి వద్దామనుకుంటుంది అకీరా (స్రవంతి). ఈమె బాయ్ ఫ్రెండ్ అభి (రాకేష్) కూడా తనతోపాటు ఇండియా వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. వెళ్లే ముందు స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలనుకుంటాడు. అలా అడవిలో ఉండే చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడ వాళ్లు బుక్ చేసుకున్న హోటల్ క్లోజ్ అవడంతో ఓ ఖాళీ ఇంట్లో బస చేస్తారు.
ఆ స్నేహితులలో సైంటిస్ట్ అయిన అరు మల్టీ యూనివర్స్ పై రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. దీని గురించి మాట్లాడుకునే క్రమంలో అభి, విశ్వకు గొడవ జరుగుతుంది. అదే సమయంలో విశ్వ ఓ భయంకరమైన డ్రగ్ తీసుకొని అకీరా, కళ్యాణ్ లను చంపేస్తాడు. మరోవైపు మల్టీ యూనివర్స్‌కు వెళ్లే దారి ఆ ఊళ్ళోనే ఉందని తెలుసుకొని అభిని తీసుకొని వెళ్తుంది అరు. తీరా అక్కడికెళ్లాక ఆమెను ఎవరో చంపేస్తారు. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగానే మల్టీ యూనివర్స్ ఉందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే!
విశ్లేషణ
తక్కువ బడ్జెట్‌లో మంచి అవుట్ పుట్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ తెరకెక్కించిన సినిమానే రహస్యం ఇదం జగత్. ఈ సినిమాను అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు నిర్మించారు. హాలీవుడ్ చిత్రాల నుంచి ప్రేరణ పొంది తీసినట్లు ఉంటుంది. మన ప్రేక్షకులకు కనెక్ట్ అవడానికి పురాణాలను వాడుకున్నారు. హనుమంతుడు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళడం.. కృష్ణుడు ఒకేసారి చాలా చోట్ల కనిపించడం.. శ్రీచక్రం నుంచి వామ్ హోల్ ఏర్పడటం వంటివి చూపించారు.
సినిమా నెమ్మదిగా మొదలవుతుంది. ఫ్రెండ్స్ ట్రిప్.. గొడవలు.. చంపుకోవడాలు.. ఇవన్నీ కాస్త సాగదీసినట్లుగానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ముందు అభి స్నేహితులు చనిపోవడంతో.. వాళ్ళను కాపాడుకోవడానికి వామ్ హోల్ కి వెళ్లడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఆసక్తి కలుగుతుంది. సెకండాఫ్‌లో ఆ సస్పెన్స్ కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు. రొటీన్ సినిమా కాకుండా.. కొత్త మూవీ చూసినట్లు అనిపించకమానదు.
ఎవరెలా చేశారంటే?
షార్ట్ ఫిలింస్‌లో నటించి మెప్పించిన రాకేష్ హీరోగా నటించాడు. వామ్ హోల్‌లోకి ట్రావెల్ చేసి వచ్చే వ్యక్తిగా బాగా నటించాడు. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే అయినా అందులో స్రవంతి తన యాక్టింగ్‌తో మెప్పించింది. సైంటిస్ట్ పాత్రకు అరు చక్కగా సరిపోయింది. భార్గవ్ కామెడీతో నవ్వించేందుకు ప్రయత్నించాడు. కార్తీక్ విలన్‌గా బాగానే చేశాడు. అయితే వీళ్లంతా అమెరికాలోనే సెటిల్ అయినవాళ్లు కావడంతో మన ఆడియన్స్‌కు కొత్తముఖాలుగా అనిపిస్తారు. పైగా అమెరికన్ యాసలోనే మాట్లాడారు.
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ బాగుంది. అమెరికాలో ఉన్న మంచి మంచి లొకేషన్స్ వెతికి మరీ చూపించినట్లుగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు ఏవీ అంతగా ఆకట్టుకోవు. డబ్బింగ్‌పై కాస్త ఫోకస్ చేయాల్సింది. డబ్బింగ్‌ను పట్టించుకోకపోవడమే ఈ సినిమాకు మైనస్. కొన్నిచోట్ల బీజీఎమ్ డైలాగులను డామినేట్ చేసింది. దర్శకుడికి తొలి చిత్రం కావడంతో అక్కడక్కడా కాస్త తడబడ్డట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment