5 ఏళ్ల వయసు నుంచే సల్మాన్‌పై పగ.. లారెన్స్ బిష్ణోయ్‌పై వర్మ ట్వీట్‌ | Ram Gopal Varma Comments On Lawrence Bishnoi | Sakshi
Sakshi News home page

5 ఏళ్ల వయసు నుంచే సల్మాన్‌పై పగ.. లారెన్స్ బిష్ణోయ్‌పై వర్మ ట్వీట్‌

Published Tue, Oct 15 2024 12:48 PM | Last Updated on Tue, Oct 15 2024 1:32 PM

Ram Gopal Varma Comments On Lawrence Bishnoi

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు ఒక్కసారిగా  దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ దారుణ ఘటనలో బిష్ణోయ్‌ల పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయి. సల్మాన్‌తో సిద్ధిఖీ ఎక్కువగా సన్నిహితంగా ఉన్న కారణంగానే ఈ హత్య చేశారని తెలుస్తోంది. ఈ అంశం గురించి తాజాగా టాలీవుడ్‌ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ పలు ట్వీట్లు చేశారు.  30 ఏళ్ల పంజాబీ గ్యాంగ్‌ స్టర్‌ జైల్లో ఉన్నప్పటికీ తన సోదరుడి సాయంతో కొందరిని ఒక టీమ్‌గా ఏర్పాటు చేసుకుని కెనడా నుంచి ఒక గ్యాంగ్‌ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ గ్యాంగ్‌తో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు.

25 ఏళ్లుగా పగను పెంచుకున్నాడు: ఆర్జీవీ
'1998లో కృష్ణజింకను చంపబడినప్పుడు లారెన్స్ బిష్ణోయ్ కేవలం 5 సంవత్సరాల పిల్లవాడు.  బిష్ణోయ్‌ల పగ కోసం 25 సంవత్సరాలుగా అతను పోరాడుతున్నాడా..! ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు 30 సంవత్సరాల వయస్సులో ఒక స్టార్‌ నటుడిగా ఉన్న సల్మాన్‌ను అంతం చేయడమే తన  జీవిత లక్ష్యం అని చెప్పడం ఏంటి..?  ఇది ఆ జంతువుపై వారికి ఉన్న విపరీతమైన ప్రేమా..? లేదా..  దేవుడు ఆడుతున్న వింత నాటకమా..?' అంటూ ఆర్జీవీ ప్రశ్నించాడు.

లారెన్స్ బిష్ణోయ్ గురించి ఆర్జీవీ మరో ట్వీట్ కూడా ఇలా చేశారు. గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఒక న్యాయవాది ( లారెన్స్‌ బిష్ణోయ్‌) ఒక సూపర్ స్టార్‌ని చంపడం ద్వారా జింక మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నాడు. అతని ఆదేశాలతో తన గ్యాంగ్‌లోని 700 మంది నడుచుకుంటున్నారు. అతను మొదట స్టార్‌ హీరోకు సన్నిహితుడైన ఒక పెద్ద రాజకీయవేత్తను చంపమని ఫేస్ బుక్ ద్వారా రిక్రూట్ చేసుకున్నాడు.  

పోలీసులు అతన్ని పట్టుకోలేరు, అడ్డుకోలేరు. ముంబై మాఫియాలోని ఇతర గ్యాంగ్‌స్టర్‌ల మాదిరిగా కాకుండా, అతను ఇప్పటికే హై సెక్యూరిటీ జైలులో,  ప్రభుత్వ రక్షణలో ఉన్నందున అతన్ని పట్టుకోవడం లేదా ఎదుర్కోవడం సాధ్యం కాదు. అని ఆర్జీవీ అభిప్రాయా పడ్డారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. కానీ, తనను చాలామంది కలుస్తుంటారని,  సెల్‌ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్‌లో ఉంటాడని పేరుంది.  అతనికి ప్రభుత్వాలు, అధికారులు సాయం చేస్తున్నారనే పరోక్షంగా ఆర్జీవీ చెప్పారు.

1998లో జరిగిన ఘటన
1998లో ఒక సినిమా షూటింగ్‌ సమయంలో సల్మాన్‌ ఖాన్‌ కృష్ణ జింకలను వేటాడారు. దీంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. అయితే, కృష్ణజింకలను బిష్ణోయ్‌ తెగ ప్రజలు చాలా పవిత్రంగా చూస్తారు. వీటిని సల్మాన్‌ వేటాడటం ఆ వర్గానికి చెందిన లారెన్స్‌కు నచ్చలేదు. అయితే, ఈ ఘటన జరిగిన సమయానికి అతని వయసు సరిగ్గా 5 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచే సల్మాన్‌పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో  2018 సమాయినికి సల్మాన్‌ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఒక గ్యాంగ్‌ను తయారు చేశాడు. అతన్ని అంతం చేసేందుకే ఉన్నామంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్నిసార్లు సల్మాన్‌పై హత్యాయత్నం కూడా చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement