నేనుగా వెళ్లి ఎవరిని అవకాశాలు అడగలేదంటున్నారు నటుడు రామరాజన్. 1980 ప్రాంతంలో టాప్ హీరోగా వెలిగారు. ముఖ్యంగా గ్రామీణ కథా పాత్రల్లో అధికంగా నటించారు. అంతే కాకుండా 44 చిత్రాల్లో సింగిల్ హీరోగా నటించిందీ రామరాజనే. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్‌కు ధీటుగా రాణించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వీరాభిమాని అయిన రామరాజన్ రాజకీయ రంగప్రవేశం కూడా చేశారు. ఆ తరువాత కొంత కాలం సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన రామరాజన్ సుమారు 14 ఏళ్ల తరువాత సామాన్యన్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.
నటనకు దూరం కాను
ఎంఎస్.భాస్కర్, రాధారవి, దర్శకుడు కేఎస్.రవికుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రాకేశ్ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై మదియళగన్ నిర్మించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చెన్నైలో చిత్రం యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో పాల్గొన్న నటుడు రామరాజన్ మాట్లాడుతూ తాను నటనకు దూరం కాదలచుకోలేదన్నారు. చాలా కథలు వింటున్నప్పటికీ ఏవీ సెట్ కాలేదన్నారు.
ఫలానా హీరోలా నటించమని..
తాను నటించిన గరగాట్టక్కారన్ చిత్రాన్ని చూస్తే శివాజీగణేశన్ నటించిన తిల్లానా మోహనాంబాళ్ చిత్రమే గుర్తుకు వస్తుందన్నారు. ఆ చిత్రంలో శివాజీగణేశన్‌కు బదులు ఎంజీఆర్ నటిస్తే ఎలా సెట్ అవుతుందని ప్రశ్నించారు. అప్పట్లో ఒక డిస్ట్రిబ్యూటర్ శివాజీ గణేశన్‌తో ఎంజీఆర్‌లా నటించాలని, ఎంజీఆర్‌తో శివాజీగణేశన్ మాదిరి నటించాలని కోరారన్నారు. అలా ప్రయత్నించి చూద్దామని ఎంజీఆర్ నటించిన పాశం, శివాజీగణేశన్ నటించిన తంగ సురంగం చిత్రాలు రెండూ ప్లాప్ అయ్యాయన్నారు.
రెండూ ఫ్లాపయ్యాయి
దీంతో ఆ రెండు చిత్రాల దర్శకుడు రామన్న ఆ ఇద్దరు హీరోలతో మీరు మీరుగానే నటించండి అని చెప్పారన్నారు. కాబట్టి ఎలాంటి పాత్ర చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో అలాంటి పాత్రల్లోనే తాను నటిస్తున్నానని చెప్పారు. ప్రారంభం నుంచి తాను కథ నచ్చితేనే నటిస్తున్నానని చెప్పారు. తానిప్పటి వరకూ అవకాశాల కోసం ఎవరిని అడగలేదన్నారు. మరో విషయం ఏమిటంటే తాను నటించింది 1986 నుంచీ 1990 వరకేనని, అయితే ఇప్పటి వరకూ ప్రేక్షకుల మనసులో నిలిచిపోవడానికి కారణం సంగీత దర్శకుడు ఇళయరాజా పాటలేనని రామరాజన్ పేర్కొన్నారు.
చదవండి: షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై మేనేజర్ దద్లానీ చేసిన పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment