రానా.. సీనీ ప్రియులకు ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తనదైన నటనతో భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో, విలన్ అనేకాదు పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాడు. కథలో కొత్తదనం ఉంటేనే అంగీకరిస్తాడు. అందుకే నేటితరం నటుల్లో రానాకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను సైతం గెలుచుకున్నాయి.
ఈ మధ్యకాలంలో అత్యధిక అవార్డులు అందుకున్న హీరో రానా అని చెప్పొచ్చు. ఆయన నటించి తొలి వెబ్ సిరీస్ ‘రానానాయుడు’కి ఇప్పటికే పలు అవార్డులు వచ్చాయి. తాజాగా ఇందులో నటనకు గాను ఉత్తమ నటుడిగా రానా అవార్డును పొందారు. ‘స్ట్రీమింగ్ అకాడమీ అవార్డు’లో ఆయన ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ‘ఇండియన్ టెలీ అవార్డు 2024’లోనూ రానాకి ఉత్తమ నటుడు(రానా నాయుడు) అవార్డు లభించింది. అలాగే 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ ఉత్తమ సహాయక నటుడు(భీమ్లానాయక్) అవార్డు రానాను వరించింది.
హోస్ట్‌గానూ..
రానా కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు.అప్పడప్పుడు బుల్లితెరపై కూడా మెరుస్తుంటాడు. ఆయన హోస్ట్‌గాను పలు టీవీ, ఓటీటీ షోలు చేశాడు. అలాగే పలు ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించి..తనదైన మాటలతో రక్తి కట్టించాడు. ఇక ఇప్పుడు అతిపెద్ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ' ఐఫా అవార్డ్స్2024'కి రానా హోస్ట్‌గా చేయబోతున్నాడు. యూ ఏ ఈ అబుదాభి లోని యస్ ద్వీపం వేదికగా సెప్టెంబర్ 6, 7 తేదీల్లో జరిగే ‘ఐఫా అవార్డ్స్2024'ప్రధానోత్సవక కార్యక్రమానికి యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి రానా హోస్ట్‌గా చేయబోతున్నాడు. అలాగే ఓ టాక్ షో కూడా ప్లాన్ చేశాడు. తన స్నేహితులు, సినీ ప్రముఖులతో కలిసి రానా టాక్ షో చేయబోతున్నాడు. ఇది ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.
నిర్మాతగానూ..
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తున్నాడు రానా. తనకు నచ్చిన సినిమాలను నిర్మించడంతో పాటు కొన్నింటికి సమర్పకుడిగా వ్యవహరిస్తుంటాడు. కేరాఫ్ కంచరపాలెం, గార్గి, చార్లీ 777, పరేషాన్, కృష్ణ అండ్ హీస్ లీల లాంటి చిన్న సినిమాలను తన బ్యానర్ ద్వారా రిలీజ్ చేసి పెద్ద విజయం అందించాడు. ఆయన నిర్మించిన ‘35-చిన్న కథ కాదు’ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment